షాకింగ్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి డీఎస్! విభేదాలు సమసినట్లేనా?

3:11 pm, Wed, 10 July 19
dharmapuri-srinivas

న్యూఢిల్లీ: కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) బుధవారం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు.

గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఆయనపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు డీఎస్.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, ఆయనపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ అప్పట్లో ఆయనకు తన అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో అవమానంగా భావించిన డీఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో.. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి పోటీలో నిలవగా.. ఆమెపై డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కవిత ఓటమిపాలవగా.. ఆమెపై డీఎస్ తనయుడు అరవింద్ గెలుపు సాధించారు.

తన కుమార్తె కవితకు వ్యతిరేకంగా అటు బీజేపీ అభ్యర్థి అరవింద్ మాత్రమేకాక.. ఇటు పలువురు రైతులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో.. ఆ ఎన్నికల్లో కవిత గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావించిన సీఎం కేసీఆర్ తన తనయ గెలుపు కోసం పలు ప్రయత్నాలు చేశారు.

అందులో భాగంగా నిజామాబాద్‌ రాజకీయాల్లో మంచి పట్టున్న టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి స్వయంగా వెళ్లి, ఆయన్ని తన పార్టీలోకి తీసుకొచ్చారు.

అయినప్పటికీ కవితపై బీజేపీ అభ్యర్థి అరవింద్ విజయం సాధించగా, అరవింద్ గెలుపు వెనుక ఆయన తండ్రి డీఎస్ ఎంతో కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. అంతేకాకుండా అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వకుండా తనను అవమానించడంపై.. డీఎస్ కూడా ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.

ఇంతా జరిగిన తరువాత.. బుధవారం ఆశ్చర్యంగా ఆయన న్యూఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఆ పార్టీ నాయకల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బహుశా టీఆర్ఎస్ అధినాయకత్వంతో ఆయనకు గతంలో ఉన్న విభేదాలు సమసిపోయి ఉంటాయని, అందుకే తిరిగి పార్టీకి దగ్గరవుతున్నారేమోనని ఆ పార్టీ నేతలు పలువురు అభిప్రాయపడుతున్నారు.