హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల కావడంతో అదే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దాదాపు 38 నియోజకవర్గాల్లో 48 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ 65 మందితో కూడిన తన తొలి జాబితాను ప్రకటించింది.
ఈ నేపథ్యంలో మహాకూటమిలో మిత్రపక్షంగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. మహాకూటమిలో భాగంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో 9 స్థానాలకు తొలివిడతగా అభ్యర్థులను ప్రకటించగా.. మిగతా ఐదు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
తొలి విడత జాబితాలో టీ-టీడీపీ సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. ఖమ్మం నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నేత నామా నాగేశ్వరరావు బరిలో నిలుస్తుండగా, సత్తుపల్లి నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి అవకాశం దక్కింది. ఉప్పల్ నుంచి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ సీటు దక్కించుకున్నారు.
కూకట్‌పల్లి స్థానం పెండింగ్…
కూకట్‌పల్లి స్థానం కూడా.. టీడీపీకే ఖరారయింది కానీ అక్కడ అభ్యర్థి విషయంలో టీడీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అక్కడ్నుంచి పోటీ చేయడానికి సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. తానే పోటీ చేస్తానంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క టీడీపీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావుకు కూకట్‌పల్లి టిక్కెట్ కేటాయించాలని.. అక్కడి మెజార్టీ టీడీపీ నేతలు కోరుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగుదేశం నాయకత్వం కూకట్‌పల్లి టిక్కెట్‌ను పెండింగ్‌లో ఉంచింది.
మరో నాలుగు స్థానాల్లో…
కూకట్‌పల్లి కాకుండా మరో నాలుగు స్థానాలకు తెలంగాణ టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అయితే .. టీడీపీకి ఏ నాలుగు స్థానాలు కేటాయిస్తారనే దానిపై.. ఇంకా క్లారిటీ లేదు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని కూడా టీడీపీకి కేటాయించారని.. అక్కడ్నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీ చేస్తారని సోమవారం రోజంతా ప్రచారం జరిగింది కానీ సాయంత్రానికి ఆ ఊసే లేదు. ఈ స్థానం నుంచి.. కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించలేదు.
ఇక టీడీపీకి స్పష్టత రావాల్సిన మరికొన్ని నియోజకవర్గాలు.. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, పఠాన్ చెరు నియోజకవర్గాలు. వీటిపై మంగళవారమే స్పష్టత ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ తొలి విడత జాబితాలో స్థానం దక్కించుకున్న అభ్యర్థులు వీరే…
నియోజకవర్గం అభ్యర్థి పేరు
ఖమ్మం నామా నాగేశ్వర రావు
సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య
అశ్వారావు పేట మచ్చ నాగేశ్వర రావు
వరంగల్ పశ్చిమ రేవూరి ప్రకాశ్ రెడ్డి
మక్తల్ కొత్తకోట దయాకర్ రెడ్డి
మహబూబ్ నగర్ ఎర్ర శేఖర్
ఉప్పల్ వీరేందర్ గౌడ్
శేరిలింగంపల్లి భవ్య ఆనంద్ ప్రసాద్
మలక్‌పేట ముజఫర్