23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తెలంగాణలో ఇష్యూలపై.. పార్లమెంటులో దుమ్మురేపిన రేవంత్, సంజయ్!

తెలంగాణలో ఇష్యూలపై.. పార్లమెంటులో దుమ్మురేపిన రేవంత్, సంజయ్!

- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ నేతలు తమ ప్రసంగాలతో దుమ్మురేపారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు భూముల వివాద అంశాన్ని లేవనెత్తారు.

కుమురం భీం జిల్లాలో ఇటీవల అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సహా పోడు భూముల సమస్యలపై రేవంత్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ప్రభుత్వం, ఆదివాసీల మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాగజ్‌నగర్‌ ఘటనను మర్చిపోకముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లలోనూ మరో ఆటవిక దాడి జరిగిందని సభ దృష్టికి తీసుకెళ్లారు.

ఏళ్ల తరబడి అడవిని పోడు చేసి ఆదివాసీలు జీవిస్తున్నారని, వారిని వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర అటవీ, హోంశాఖ మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే సమీక్ష జరపాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

‘‘కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు..’’

బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్ లోక్‌సభలో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల జరిగిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటర్‌ బోర్డు వైఫల్యం వల్ల విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. ఇంటర్‌ బోర్డు వ్యవహారంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో 27మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. 9లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే గ్లోబరీనా వల్ల సుమారు 3లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారని విమర్శించారు.

ఈ ఘటనపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తంచేసినా కేసీఆర్‌ స్పందించలేదని మండిపడ్డారు. ప్రముఖులు చనిపోతేనే పరామర్శలకు వెళ్లే కేసీఆర్‌కు విద్యార్థుల ఆత్మహత్యలు పట్టలేదని సంజయ్ విరుచుకుపడ్డారు.

- Advertisement -