

హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్నకు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.12లో తారక రత్న నడుపుతున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు జీహెచ్‌ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న నందమూరి తారకరత్న వెంటనే కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ వద్దకి చేరుకున్నారు. అయన అధికారులని అడగ్గా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా…
డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీంతో తారకరత్న ఈ రెస్టారెంట్‌ను ఖాళీ చేయడానికి కొంతమేర సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. దీంతో రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు.
అయితే ఇచ్చిన గడువులోగా రెస్టారెంట్ నిర్వాహకులు సామగ్రిని తరలించకపోవడంతో అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతకు ఉపక్రమించారు.








