25.5 C
Hyderabad
Monday, November 2, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కేటీఆర్‌వి అబద్ధాలు, ఆయన హయాంలోనే గ్లోబరీనాకు టెండర్: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌వి అబద్ధాలు, ఆయన హయాంలోనే గ్లోబరీనాకు టెండర్: రేవంత్ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌ చెప్పేవన్నీ అబ్ధాలేనంటూ రేవంత్ దుయ్యబట్టారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.

తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫలితాల అనంతరం ఫెయిల్ అయ్యామనే బాధతో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటుచేసుకోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఈ మూల్యాంకనానికి సంబంధించిన టెండర్లను హైదరాబాద్‌కు చెందిన గ్లోబరీనా అనే సంస్థకు కట్టబెట్టడంలో కేటీఆర్‌ పాత్ర ఉందంటూ వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో అసలు గ్లోబరీనా సంస్థ గురించే తనకు తెలియదని, తాను ఎన్నడూ ఆ పేరే వినలేదని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే గ్లోబరీనా సంస్థ ఆ టెండర్లు దక్కించుకుందని, కేటీఆర్ అలా అనడం ప్రజలను మోసగించడమేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ అనేది 1996లో ఎంతో కట్టుదిట్టంగా ఉండేదని రేవంత్ చెప్పారు. ఆ సమయంలో పరీక్షల బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించారని, పరీక్షలు కూడా సాఫీగా జరిగేవని, సీజీజీ ఆధ్వర్యంలోనే పరీక్షల ప్రకటన, ముద్రణ, ఫలితాలు వేర్వేరుగా మూడు సంస్థలకు అప్పగించేవాళ్లని, ఏనాడూ ఎక్కడా ఇబ్బంది తలెత్తలేదని ఆయన వివరించారు.

2016లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ని పక్కనబెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫో అనే సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారని, ఆ తరువాతే ఎంసెట్ ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణ మొదలెపెట్టడంతో.. ప్రధాన నిందితుల్లో ఇద్దరు అనుమానాస్పద రీతిలో చనిపోయారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్లోబరీనా సంస్థ కూడా మ్యాగ్నటిక్ ఇన్ఫో సంస్థ భాగస్వామేనని చెప్పారు.

మ్యాగ్నటిక్ ఇన్ఫో సంస్థపై నిషేధం ఉండడంతో గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందని రేవంత్ ఆరోపించారు. సంస్థలు వేర్వేరేగానీ వ్యక్తులందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు.

‘‘కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి సంబంధించిన టెండర్లు పిలిచారు.. ఇప్పుడేమో అసలు ఆ సంస్థ పేరే ఎప్పుడూ వినలేదంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఇలా చెప్పి ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు?’’ అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

చదవండి:  తెలంగాణలో విపక్ష నేతల ముందస్తు అరెస్ట్! ఇంటర్ హీటే కారణమా?
- Advertisement -