
లక్నో: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన అత్తగారింటికి వెళ్లి అక్కడ వారితో గొడవకు దిగిందన్న కారణంపై ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కాసేపటి తరువాత ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు.
క్రికెటర్ మహ్మద్ షమీకి, అతడి భార్యకు మధ్య గొడవలు ఉన్న విషయం తెలిసిందే. తనను భర్త హింసిస్తున్నాడని, చంపేందుకు కూడా ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ షమీ భార్య హసీన్ జహాన్ గతంలో భర్తపై సంచలన ఆరోపణలు కూడా చేసింది.
అంతేకాకుండా, హసీన్ జహాన్ తన భర్తపై వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టింది. దీంతో కోల్‌కతా పోలీసులు ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కేసులు నమోదు చేసి, చార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు.
అత్తవారింటికెళ్లి, గొడవ పడి…
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని సహాస్‌పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న షమీ ఇంటికి వెళ్లిన హసీన్.. అక్కడ అత్తింటి వాళ్లతో గొడవ పడింది. దీంతో వారు ఆమెను తమ ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. అందుకు నిరాకరిస్తూ.. హసీన్ జహాన్ తన కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు షమీ ఇంటికి చేరుకుని హసీన్ జహాన్‌ను అరెస్టు చేశారు. అయితే కాసేపటి తర్వాత ఆమెను బెయిలుపై విడుదల చేశారు. అనంతరం దీనిపై హసీన్ మాట్లాడుతూ.. తాను తన భర్త ఇంటికి వచ్చానని, తనకు ఆ ఇంట్లో ఉండేందుకు సర్వహక్కులు ఉన్నాయని చెప్పారు.
అత్తింటి వాళ్లు తనతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. తనను పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారని, నిజానికి పోలీసులు అరెస్టు చేయాల్సింది తనను కాదని, తన అత్తింటి వాళ్లనని హసీజ్ జహాన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె భర్త, టీమిండియా బౌలర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌లో అతడు ఆడాల్సి ఉంటుంది.








