Mansoon: వేసవి తాపం నుంచి విముక్తి! నేడు తెలంగాణలో ప్రవేశించనున్న రుతుపవనాలు…

- Advertisement -

హైదరాబాద్‌: వేసవి తాపం నుంచి విముక్తి లభించింది. నేటి నుంచి నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశించనున్నాయి.

ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తొలకరి కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న రైతులకు ఇది నిజంగా శుభవార్తే.

అవును, తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

శనివారం నాటికే ఈ రుతుపవనాలు.. పశ్చిమ భారత ప్రాంతాలైన గోవా, కొంకణ్‌, కర్నాటకలో విస్తరించాయని, సోమవారం నాటికి తెలంగాణ రాష్ట్రానికి కూడా చేరుకుంటాయని అధికారుల అంచనా.

అయితే పశ్చిమ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోనే రుతుపవనాల ఆగమనానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు.

వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అయితే ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కూడా వాతావరణశాఖ పేర్కొంది.

మరోవైపు రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ ఎండలు అధికంగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఈ రుతుపవనాల ప్రభావం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శనివారం అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 4, తలమడుగులో 3.5, పిప్పల్‌ధరిలో 3.3, వడ్యాల(నిర్మల్‌)లో 2.9, మేనూరు(కామారెడ్డి)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -