హైదరాబాద్‌లో సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం, కాంగ్రెస్ మేడ్చల్ సభకు మరింత ఊపు…

sonia-gandhi-1
- Advertisement -

sonia-gandhi-medchal-meeting

హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు.  ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నాలుగున్నరేళ్ల తరువాత ఆమె తొలిసారిగా తెలంగాణ గడ్డపై కాలుమోపారు.  ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నసోనియాకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు.

కొంత కాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సోనియాగాంధీ ప్రచార కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా  కూడా ఏ సభలోనూ ఆమె పాల్గొనడం లేదు. కానీ, తెలంగాణలో మహాకూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మాత్రం ఆమె అంగీకరించారు.

మేడ్చల్‌లో శుక్రవారం కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభకు సోనియా గాంధీతోపాటు ఆమె తనయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా పాల్గొననున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  నేతలు మేడ్చల్ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.  మధ్యప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ రాకకు మరింత సమయం పడుతుండడంతో సోనియా గాంధీ రోడ్డు మార్గాన మేడ్చల్ సభాస్థలికి చేరుకున్నారు.

120 మంది కూర్చునేలా భారీ వేదిక… 

మరోవైపు, మేడ్చల్ సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో మహాకూటమి మద్దతుదారులు, అభిమానులు చేరుకున్నారు. వేదికపై ప్రజాగాయకుడు గద్దర్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణతో పాటు పలువురు నేతలు ఆశీనులయ్యారు. దాదాపు 120 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటు చేశారు.

ఆలస్యంగా రాహుల్…

నిజానికి ఢిల్లీ నుంచి సోనియా, మధ్యప్రదేశ్ నుంచి రాహుల్.. ఇద్దరు ఐదు నిమిషాల తేడాతో హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. అనివార్య కారణాల రీత్య రాహుల్ 40 నిమిషాలు ఆలస్యంగా రానున్నారు. బేగంపేటకు చేరుకున్న వెంటనే రాహుల్ అక్కడ ఎంపిక చేసిన 21 మంది ఏఐసీసీ, టీపీసీసీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డు మార్గంలో మేడ్చల్ సభాస్థలికి చేరుకుంటారు.

సోనియాకు పౌరసన్మానం…

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి మేడ్చల్ ప్రచార సభలో పౌరసన్మానం చేస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడ్డాక పార్టీ అగ్ర నేతలతో తెలంగాణ కాంగ్రెస్‌ తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ సభ కూడా ఇదే కావడంతో లక్షలాదిమందితో సభ నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

మేడ్చల్‌ చుట్టూ ఉన్న 40 నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 వేల మంది వస్తారని అంచనా.

- Advertisement -