హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండటం విశేషం. అనంతరం సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తొలుత స్పీకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. కానీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అందుకు అంగీకరించకపోవడంతో చివరికి రేవంత్ రెడ్డి తన తన రాజీనామా లేఖను సంబంధిత కార్యాలయంలో అందజేశారు. కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ మధ్యన కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఉండలేకనే…
రాజీనామా అనంతరం ఆయన్ని పలకరించిన మీడియాతో రేవంత్ మాట్లాడూతూ సీఎం కేసీఆర్‌పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గాడిలో లేదని, అందుకే నిరసనగా తన పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పక్కనబెట్టేశారని, రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని వ్యాఖ్యానించారు.
ఇలాంటి పిచ్చోడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో సభ్యుడిగా ఉండటం కంటే రాజీనామా చేయడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి గానీ, ప్రజాస్వామ్య విలువలకుగానీ ఎక్కడా తావులేదని, రాష్ట్రంలో పాలన తుగ్లక్ పాలన కన్నా దారుణంగా ఉందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
అంతేకాదు, హస్తసాముద్రికం, చిలకజోస్యం, గవ్వలను నమ్ముకుని తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలనుకోవడం సీఎం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. ‘ఏ శాస్త్రిగారు ఏం చెప్పారోగానీ ఆ పిచ్చిలో పడి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. ఆయన పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఇట్లాంటి పిచ్చోడున్న సభలో.. సభకు, సభ్యులకు, ప్రజాస్వామ్య విలువలకూ గౌరవం ఎక్కడుంటుంది..’’ అని ప్రశ్నించారు. అసలు చట్టాలు, శాసనాల పట్ల వారికి అవగాహన ఉందో లేదో అని కూడా రేవంత్ అనుమానం వ్యక్తం చేశారు.