ఉత్కంఠకు తెర: తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ ఆమోదం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్

kcr-with-governor
- Advertisement -

kcr-with-governor

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ గురువారం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏక వాక్య తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ప్రగతి భవన్‌లో సుమారు 5 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ భేటీలో ముందుగా నిర్ణయించిన సమయానికే అసెంబ్లీ రద్దు తీర్మానంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు ప్రత్యేక బస్సులో రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ నరసింహన్‌‌తో సమావేశం అయ్యారు. అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు అందజేశారు. అసెంబ్లీ రద్దు చేయాలని కోరడానికి గల కారణాలను గవర్నర్‌కు వివరించారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు.  ఆ వెంటనే అసెంబ్లీ రద్దయినట్టు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి రాజ్ భవన్ నుంచి నోటీసులు వెళ్లాయి.

అసెంబ్లీ రద్దుకు గవర్నర్ నరసింహన్ తన ఆమోదాన్ని తెలుపడంతో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా మాజీలయిపోయారు. ఈ సందర్భంగా..  ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, కేర్ టేకర్ గవర్నమెంట్‌ను నడిపించాలని కేసీఆర్‌ను గవర్నర్ నరసింహన్ కోరారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం, టీఆర్ఎస్ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు.

మరోవైపు ‘తెలంగాణ’లో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు. కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ జీవో నెంబర్ 134ను జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి ఓ ప్రకటనలో తెలిపారు.


 

 

- Advertisement -