కామారెడ్డి: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం కామారెడ్డి జిల్లాలో రోడ్ షో నిర్వహించిన ఆయన నిజాంసాగర్ జంక్షన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను తెలంగాణను పట్టిపీడిస్తోన్న నాలుగు కొరివి దెయ్యాలుగా అభివర్ణించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదుగానీ.. కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. ఒక్క కేసీఆర్ ఇంట్లోనే ఆ ఐదుగురూ కలిపి నెలకు రూ.30 లక్షల జీతం తీసుకుంటున్నారంటూ దుయ్యబట్టారు.
షబ్బీర్ అలీని గెలిపించండి…
బోధన్‌లో నిజాం షుగర్స్ తెరుచుకోకపోవడానికి కారణం కేసీఆర్ అని, ఆయన ఉద్యోగాన్ని ఊడగొడితే.. వంద రోజుల్లో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని రేవంత్ ఉద్వేగంగా మాట్లాడారు. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి.. ఇవన్నీ ఏవని రేవంత్ ప్రశ్నించారు.
వారికి బుద్ధి చెప్పండి…
టీఆర్ఎస్‌ను సాగనంపే రోజు ఎంతో దూరంలో లేదని అంటూ, ప్రతి పనిలో, ప్రతి ప్రాజెక్టులో కమీషన్లు తీసుకుంటున్న ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, పోచారం కుమారుల అవినీతి కూడా పెరిగిపోయిందని, వారు ఇసుక, కంకరను దోచుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాన్ని దోచుకుతింటున్న గంప గోవర్ధన్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఆ సన్నాసులు పోతే నష్టమేం లేదు…
ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొంతమంది సన్నాసులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఇక్కడ్నించి పోటీకి దిగే షబ్బీర్ అలీని గెలిపించాలని రేవంత్ కోరారు. ఆయన్ని గెలిపిస్తే.. నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని అభయం ఇచ్చారు.