భైంసాలో కాంగ్రెస్ సభ: కేసీఆర్, మోడీలపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

- Advertisement -

rahul-gandhi-bhainsa-meeting

భైంసా: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేసీఆర్ కుటుంబం తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడిందని… కోట్ల రూపాయలను దండుకుందని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి, ఇష్టానుసారం నిధులు ఖర్చు చేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. రీడిజైన్ల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ప్రతి రంగంలో అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని, సాధారణ ప్రజానీకానికి ఏం ఒరగబెట్టారని వ్యాఖ్యానించారు.

వాళ్లు నోరు తెరిస్తే.. అబద్ధాలే!

ప్రధాని మోడీ, కేసీఆర్‌లు ఎక్కడకు వెళ్లినా అబద్ధాలే చెబుతారని అన్నారు. రైతులకు సరైన ధర ఇవ్వకుండా, వారి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్… వాటిని ఇచ్చారా? అని రాహుల్ ప్రశ్నించారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమం కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను పక్కన పెట్టేశారని మండిపడ్డారు.

అందరూ అంబేద్కర్ సిద్ధాంతాలను పాటిస్తుంటే… కేసీఆర్‌కు ఆయన పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదని అన్నారు. ఏ ఒక్క పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని… ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఆయన కార్పొరేట్ల పక్షపాతి…

ప్రధాని మోడీ కార్పొరేట్ వ్యాపారులకు మాత్రమే న్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాఫెల్ స్కాం ద్వారా తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కట్టబెట్టారని, దేశ ప్రజలను మాత్రం నడిరోడ్డు ఏటీఎంల వద్ద నిలబెట్టారని విమర్శించారు. దేశానికి కాపలాదారుడిగా ఉంటానని చెప్పిన మోడీ.. ఎవరికి కాపలా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. అంబానీలు, అదానీల వంటి 15 మంది కార్పొరేట్లకు మోడీ కాపలాదారుడిగా ఉన్నారని అన్నారు. దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోడీ… దొంగలా మారారని వ్యాఖ్యానించారు.

దేశంలో ఎక్కడ చూసినా ఆత్మహత్యలే కనిపిస్తున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ వేశారా? అని ఆయన ప్రశ్నించారు.

మళ్లీ అధికారంలోకి వస్తే…

రాబోయే ఎన్నికల్లో అక్కడ మోడీ పాలనకు, ఇక్కడ కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని రాహుల్ పిలుపునిచ్చారు. యూపీయే హయాంలో పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే… ఏక కాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

- Advertisement -