ఆర్టీసీ సమ్మె: గన్‌ పార్క్ వద్ద ఉద్రిక్తత, కార్మిక నేతల అరెస్టు.. అయినా తగ్గేది లేదన్న జేఏసీ నేతలు

1:55 pm, Mon, 7 October 19
tsrtc-strike-jac-leaders-at-gun-park

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరింది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు పట్టు వీడకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారమే ప్రకటించారు. 

అయితే ఈ దీక్షకు అనుమతి లేదని, ఆంక్షలు అమలులో ఉన్నాయని, బలవంతంగా నిరాహార దీక్షలు చేయ సంకల్పిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు కూడా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులతో కలిసి అక్కడికి చేరుకోగా పోలీసులు వారిలో కొందరిని తమ అదుపులోనికి తీసుకున్నారు. 

అయినా వెనక్కి తగ్గని కార్మికులు…

మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయినా సరే కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. తమ దీక్షలకు మద్దతు ఇవ్వాలంటూ జేఏసీ నేతలు పలు రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కోరారు. 

అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ఇందిరా పార్కు వద్ద తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని జేఏసీ నేతలు ప్రకటించారు. అలాగే తమ భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరా పార్కు వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. 

మరోవైసపు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల నుండి వారిని తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇందిరా పార్కు వద్ద ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.