కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ: టీఆర్ఎస్‌లోకి పాలేరు ఎమ్మెల్యే!

Paleru MLA upender reddy met Ktr and will joins TRS, Newsxpressonline

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ దెబ్బ తగులుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని వీడి అధికార పార్టీ టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందిన కందాళ ఉపేందర్ రెడ్డి గులాబీ గూటికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.

టీఆర్ఎస్ నుంచి హామీ..

గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉపేందర్ రెడ్డి కలవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కేటీఆర్‌తో భేటీ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా, గత కొంతకాలం నుంచి ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఇస్తామన్న హామీ ఉపేందర్ రెడ్డికి టీఆర్ఎస్ పెద్దల నుంచి లభించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫారంపై పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఇది ఇలావుంటే, ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ సీటు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చలు జరిపుతున్నారు.