

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి(డిప్యూటీ స్పీకర్)గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక విషయాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రకటించారు. అనంతరం పద్మారావు గౌడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, సభాపతి అభినందనలు తెలిపారు.
నూతన ఉపసభాపతికి మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు చెప్పారు. అనంతరం ఆయన్ని సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి పద్మారావుతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిది అని తెలిపారు.
ఆదర్శంగా నిలిచారు..
రెండుసార్లు కార్పొరేటర్‌గా ఆయన ఎన్నికయ్యారు. కార్పొరేటర్ పదవి వదులుకొని 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావు. పద్మారావు ప్రజలతో మమేకమయ్యే తీరు అందరికి ఆదర్శమన్నారు. జంట నగరాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
మంత్రిగా పద్మారావు హయాంలో లక్షలాది ఈత, తాటి మొక్కలు నాటారు. కల్లుగీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశారు. పద్మారావు గౌడ్ హైదరాబాద్ కార్పొరేటర్‌గా ప్రజలకు ఎంతో సేవ చేశారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.








