సినీహీరో, టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ దుర్మరణం

nandamuri-harikrishna
- Advertisement -

harikrishna-death

నల్గొండ: ఎన్టీఆర్‌ కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున హరికృష్ణ ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ప్రమాదం జరిగిన సమయంలో  ఎపి 28 బిడబ్ల్యు 2323 టయోటా ఫార్చునర్ కారును హరికృష్ణ స్వయంగా నడుపుతున్నట్లు సమాచారం.

కారులో హరికృష్ణతోపాటు ఆయన మిత్రులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి వారు  ప్రయాణిస్తోన్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో హరిక‌ష్ణ  తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆయన్ని నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతిచెందారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హరికృష్ణ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరి వెళ్లారు.

గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ కూడా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అంతేకాదు, హరికృష్ణ మరో కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  ఇప్పుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే అసువులుబాయడంతో వారి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలే వెంటాడుతున్నట్లు అభిమానులు చెప్పుకుంటున్నారు.

ఓ అభిమాని పెళ్లికి వెళుతూ…

నెల్లూరు జిల్లాలోని కావలిలో ఓ అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుఝామున 4.30కి హరికృష్ణ తన ఇద్దరు మిత్రులతో కలిసి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ నడుపుతున్న కారు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం విషయం తెలియగానే హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కామినేని ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.  హరికృష్ణకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

చంద్రబాబు, నారా లోకేష్ తీవ్ర దిగ్భాంతి…

హరికృష్ణ మరణవార్త వినగానే ఇటు సీఎం కేసీఆర్ఋతోపాటు అటు ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కూడా తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. వెంటనే చంద్రబాబు ఈ రోజు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.  వారు హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

- Advertisement -