హాస్టల్ గదిలో ఉరేసుకున్నఇంటర్ విద్యార్థిని, ఫీజు వేధింపులే కారణమా?

student-archana-suicide
- Advertisement -

student-archana-suicide

హైదరాబాద్‌: ఫీజు వేధింపులు భరించలేక ఓ ఇంటర్‌ విద్యార్థిని మంగళవారం తన హాస్టల్‌ గదిలోనే ఉరేసుకుని విగతజీవిగా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండల కేంద్రానికి చెందిన ధరణి సాయిలు ఆర్టీసీ కండక్టర్.  అతడి పెద్ద కుమార్తె  అర్చన(15) చైతన్యపురిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో బైపీసీ ఫస్టియర్‌ చదువుతోంది.

కళాశాల ఫీజు రూ.లక్షకుగాను సాయిలు రెండు నెలల క్రితం రు.50 వేలు చెల్లించారు. అయితే మిగతా ఫీజు చెల్లించాలంటూ శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం కొన్నిరోజులుగాఅర్చనపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా అర్చన ఇంటికి వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వచ్చింది.  హాస్టల్‌లోని తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకోగా,  భోజన విరామ సమయంలో గదికి వచ్చిన సహ విద్యార్థినులు ఆ విషయం గమనించి వార్డెన్‌కు సమాచారమందించారు.

వార్డెన్‌ వెంటనే వచ్చి అర్చనను అక్కడికి  సమీపంలోని ఓమ్నీ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.  అర్చన అప్పటికే మృతి చెందిందని ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో కళాశాల నిర్వాహకులు ఆమె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు, కాలేజీ నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి అనంతరం కళాశాలను మూసేసి పారిపోయారు.

పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అర్చన తల్లిదండ్రులు పరుగుపరుగున కాలేజీకి వచ్చి భోరున విలపించారు. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపుల కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని, వారం రోజుల్లో ఫీజు మొత్తం చెల్లించాలని తాము అనుకున్నామని, అప్పటివరకు తమ బిడ్డను కాలేజీకి పంపక పోయినా బాగుండేదంటూ వారు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు విద్యార్థిని అర్చన ఆత్మహత్యతో శ్రీచైతన్య  కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన…

ఈ విషయం తెలియగానే పలు విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు తరలివచ్చి అర్చన తల్లిదండ్రులతో కలసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. అర్చన ఆత్మహత్యకు కారణమైన కళాశాల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్‌ఎఫ్, టీఆర్‌ఎస్‌వీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ తదితర సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కళాశాల నిర్వాహకులు ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -