ఇక బీజేపీ లక్ష్యం.. తెలుగు రాష్ట్రాలే! ఇతర దక్షిణాది రాష్ట్రాలపైనా దృష్టి!!

- Advertisement -
న్యూఢిల్లీకర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయా? కర్ణాటక ద్వారా దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాలకూ విస్తరించాలని బీజేపీ పావులు కదుపుతోందా? అంటే.. తాజా పరిణామాలు అవుననే అనిపిస్తున్నాయి. 104 సీట్లు సాధించి కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఇకపై ఇతర దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించనుంది. ‘‘కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మా రాజకీయం ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు..’’ అంటూ ఇటీవల పలువురు బీజేపీ ముఖ్యనేతలు వ్యాఖ్యానించారు.
త్వరలో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారతాయని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా జరిగిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సమావేశంలో అమిత్‌ షా మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు విశ్రమించవద్దని సూచించారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లను ఇప్పటికిప్పుడే ప్రభావితం చేయలేకపోయినా నిర్మాణాత్మక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలగిన నేపథ్యంలో ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలతో బీజేపీ సొంతగా ఎదగాలని భావిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కార్యాచరణ..

‘ఈ రోజు కర్ణాటకలో కంఠీరవ.. రేపు ఏపీలో అదరహో’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రజలు సానుకూల రాజకీయాలను ఆహ్వానిస్తున్నారని.. అసత్యాల రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ‘‘కర్ణాటక ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బలమైన శక్తిగా ఎదుగుతామని నేనంటే ప్రగల్భాలు పలుకుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు కర్ణాటకలో సిద్దరామయ్యకు, ఏపీలో చంద్రబాబుకు చుక్కెదురయింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీకి బుద్ధి వస్తే.. నిజం తెలిస్తే, అబద్ధాలతో పని కాదని తెలుసుకుంటుంది. కేవలం ప్రచారమే ప్రభుత్వం అనే రీతిలో ముందుకువెళ్తే వచ్చే ఏడాది మీరు సిద్దరామయ్య కంటే దారుణమైన పరిస్థితిని చూడాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఏపీలో సరైన కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తామన్నారు.

 ఇక తెలంగాణలోనూ జోరు..

కర్ణాటక జోరును తెలంగాణలోనూ చూపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్న షా.. రాష్ట్ర పర్యటనలో భాగంగా తొలిదశలో మొత్తం పరిస్థితిని సమీక్షిస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌, కర్ణాటక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. పన్నా ప్రముఖ్‌ పేరుతో బూత్‌స్థాయిలో పక్కా కార్యాచరణను చేపట్టింది. కేంద్రం అమలుచేస్తున్న పథకాలను వివరించడంతో పాటు టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చేనెల మొదటివారం నుంచి బస్సుయాత్ర చేపట్టనుంది.
 ‘కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధిగమించడంలో సఫలమయ్యాం. ఏ పార్టీ నుంచైనా కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకున్న నేతలు తమ వైఖరి మార్చుకుంటారు’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో కచ్చితంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తర్వాత ఏపీ, తమిళనాడు, కేరళ.. ఇదే తమ కార్యాచరణ అని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ గాలి తెలంగాణ వైపు మరలడం ఖాయమని ఎంపీ దత్తాత్రేయ అన్నారు.
- Advertisement -