కాకినాడ: గోదావరిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ ఉన్నట్లుండి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. మరో 16 మంది ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కోసం మంగళవారం రాత్రి నుంచి గాలింపు జరుగుతోంది. సహాయక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
గోదావరి నదిలో మునిగిన లాంచీని బయటికి తీసేందుకు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. సుమారు 60 అడుగుల లోతున లాంచీ ఉన్నట్లు తెలిసింది. 350 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. హెలికాప్టర్లను ఉపయోగించి గల్లంతైన వారి కోసం గాలింపు జరుపుతున్నారు.
మంగళవారం సాయంత్రం ఈ లాంచీ ప్రమాదం చోటచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరి నదిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయని, ఆ గాలుల వల్లే ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడటంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని కొందరు చెబుతుంటే.. పది మంది వరకే జలసమాధి అయి ఉంటారని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ ప్రమాదంపై కచ్చితమైన సమాచారం తెలియడం లేదు. ఫలితంగా లాంచీలో వెళ్ళిన ప్రయాణికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు తమ వారు క్షేమంగా ఉన్నారా లేదా అన్నది తెలియక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.