23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ Heavy Rains: రోజంతా వానే వాన.. స్కూళ్లు బంద్.. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా...

Heavy Rains: రోజంతా వానే వాన.. స్కూళ్లు బంద్.. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు!

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సమీప జిల్లాలతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి.

చదవండి: ED Officer Suicide: షాకింగ్: ఈడీ అధికారి ఆత్మహత్య! అసలేం జరిగింది?

ఇక గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో అయితే మంగళవారం తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు చిన్నసైజు చెరువులను తలపించాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ఫలితంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రయాణికులకు నానా అవస్థలు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలు పాఠశాలల యాజమాన్యాలు స్కూళ్లకు ముందస్తు సెలవు ప్రకటించాయి. ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాలతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో ఇప్పుడు వర్షపాతం మరింత పెరిగినట్లయింది.

రాష్ట్రంలో ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడగా, దక్షిణ ప్రాంత జిల్లాల్లో.. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 2.2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు అయినట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌లో భీభత్సం…

ఈ భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది.  వరద నీటి ధాటికి ఆయా కాలనీల్లో కారులు, బైకులు కొట్టుకుని పోయాయి. ముషీరాబాద్ పార్శిగుట్టకు చెందిన ఓ వ్యక్తి(43) వరద నీటిలో కొట్టుకొనిపోయి మరణించినట్లు తెలుస్తోంది.

పలు ప్రాంతాల్లో ఇళ్ల గోడలు కూలి వాహనాలు ధ్వంసం కాగా, పిడుగు పడి ఓ అపార్ట్‌మెంట్‌ కొంత మేర ధ్వంసం అయినట్లు సమాచారం. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి వరదనీరు పోటెత్తుతోంది. మూసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. అధికారులు ముందస్తు జాగ్రత్తగా కొంత నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. అలాగే మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాల కారణంగా గ్రేటర్ లోని జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.

రాబోయే రెండు రోజులు…

వచ్చే రెండు రోజులు అంటే బుధ, గురువారాల్లో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.

 

- Advertisement -