హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతానికి టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం పూర్తి కావడంతో… ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే నెలకొంది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలలో 12మంది టీఆర్ఎస్‌లో చేరారు. ఇక ఎంపీగా గెలవడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
దీంతో టీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని స్పీకర్‌కి లేఖ ఇవ్వడం…వెంటనే స్పీకర్ ఆ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో కాంగ్రెస్‌కి 6గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఇక ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టయ్యింది.
సబితాకి మంత్రి పదవి పక్కా..
ఇక అన్నీ ఎన్నికలు అయిపోవడంతో కేసీఆర్…మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మాజీమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాత్రం మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే తన కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్… ఇద్దరు మహిళలను కేబినెట్‌లోకి తీసుకుంటానని అసెంబ్లీలో ప్రకటించారు.
దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఆమెకు మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. మరి మంత్రి పదవి దక్కించుకునే మరో మహిళా ఎవరో చూడాలి.








