మెదక్: త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గానూ 16 స్థానాల్లో గెలుపు ఏకపక్షమేనని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పార్టీల మధ్య కాదని, తమ అభ్యర్థుల మధ్యే.. వారు సాధించే మెజార్టీ మధ్యేనని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. మెదక్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
హరీశ్ రావుకు కేటీఆర్ సవాల్
ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బావాబావమరదులకు ఏమీ కాలేదని… ఇద్దరం బాగున్నామని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానం కంటే మెదక్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజర్టీటీ సాధించాలని… హరీష్‌కు ఇదే తన సవాల్ అని చెప్పారు. మెదక్ కంటే కనీసం ఒక్క ఓట్లైనా తాము ఎక్కువ తెచ్చుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. షరతు కూడా కడతానని అన్నారు.
‘2014లో పూర్తి మెజార్టీతో ప్రజలు మోడీని గెలిపిస్తే చేసిందేమీ లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీలకే నిధులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేని పార్టీలకు నిధులు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని అడిగితే ఇవ్వలేదు. తెలంగాణ కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉంటే నిధులు వాటంతట అవే వస్తాయి. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి ప్రశంసలే తప్ప నిధులు రాలేదు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. మోడీ పాలన పట్ల దేశవ్యాప్తంగా విముఖత వచ్చింది. రైతులకు మేలు చేసే పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. తెలంగాణ ‘రైతు బంధు’ను ఇప్పుడు కేంద్రం, చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. కేసీఆర్‌ను విమర్శించే చంద్రబాబు కూడా ఈ పథకాన్ని కాపీ కొట్టారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా కేసీఆర్ నడిపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలి’ అని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
గోల్కొండ కోట మీద ఇప్పటికే గులాబీ జెండా ఎగిరిందని, రేపు ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగరేయాలో నిర్ణయించేది తెలంగాణయేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు మనం గెలిస్తే ఢిల్లీలో శాసించవచ్చని సూచించారు.
కేసీఆర్‌కు కానుకగా హరీశ్ రావు..
మెదక్ లోక్‌సభ స్థానాన్ని గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపు నిచ్చారు. ఇంతకుముందు 3లక్షల మెజార్టీ వచ్చిందని.. ఇప్పుడు 5లక్షల మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించుకోవాలన్నారు. మెదక్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ జిల్లా బిడ్డ కావడం వల్లనే అభివృద్ధి సాధ్యమవుతోందని, అందుకు కృతజ్ఞతగా రాబోయే ఎన్నికల్లో ఐదు లక్షల మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించాలని ప్రజలను కోరారు.
గజ్వేల్, మెదక్ కు రెండు నెలల్లో రైలు రాబోతోందని, త్వరలోనే నర్సాపూర్ బస్సు డిపోను ప్రారంభిస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ జిల్లాకు జులై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రానున్నాయని చెప్పారు. దేశాని్కే ఆదర్శంగా గజ్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మెతుకు సీమ వలసల జిల్లాగా మారిందని విమర్శించారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషితో మెతుకు సీమగా మారుతోందన్నారు.








