కసరత్తు మొదలెట్టిన కేసీఆర్, ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం

kcr
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీసిన టీఆర్‌ఎస్‌ చీఫ్ కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గురువారం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్ శుక్రవారం హుస్నాబాద్‌ బహిరంగ సభతో ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ.. త్వరలోనే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను అందజేస్తుందని, టికెట్‌ వచ్చిందని గర్వపడరాదని, క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేసి, రేపటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ సూచించారు.

నియోజక వర్గంలోని అన్నిస్థాయిల్లో నేతలను కలుపుకొని వెళ్లాలని, తాను ప్రతీ నియోజక వర్గానికి వస్తానని, ఒక్కో రోజు రెండు మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. అసంతృప్తి నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే వారిని బుజ్జగించాలని సూచించిన కేసీఆర్ మరో సమావేశంలో కలుద్దామని అభ్యర్థులకు చెప్పారు.

 

- Advertisement -