

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి 33 జిల్లాలు. తాజాగా, మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుకు శనివారం రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫిబ్రవరి 17(ఆదివారం) నుంచి ఈ కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. ఇక ఈ రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమించాల్సి ఉంది.
నారాయణపేట జిల్లాలో మండలాలు…
నారాయణపేట, దామరగిద్ద, మరికల్, కోస్గి, ధన్వాడ, నర్వ, మద్దూర్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణా.
ములుగు జిల్లాలో మండలాలు…
ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట, వాజీడు, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వెంకటాపు రం.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 31 జిల్లాలు ఉన్నాయి. వాటితోపాటూ 69 రెవెన్యూ డివిజన్లు, 585 మండలాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 71కి, మండలాల సంఖ్య 583కి చేరనుందని అధికారులు తెలిపారు.
చదవండి: మాఘశుద్ధ పౌర్ణమి రోజున తెలంగాణ కొత్త కేబినెట్ విస్తరణ








