27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కూతురి కోసం కేసీఆర్ భలే వ్యూహం! టీఆర్ఎస్‌లో మండవ చేరిక అందుకేనా?

కూతురి కోసం కేసీఆర్ భలే వ్యూహం! టీఆర్ఎస్‌లో మండవ చేరిక అందుకేనా?

kcr-kavitha-mandava
- Advertisement -

హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది సామెత. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు అనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే అభిలాష కలిగిన ఆయన ముందు తన పార్టీని అన్ని విధాలా చక్కదిద్దుతున్నారు.

ముఖ్యంగా తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే.. రాష్ట్రంలో తన స్థానంలో తన తనయుడు కేటీఆర్‌ ఉండాలన్నది కేసీఆర్ మనసులోని మాటగా చెప్పుకుంటున్నారు.

తానంటే అనుభవం కలిగిన రాజకీయ నేత. ఎలాంటి పరిస్థితులనైనా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోగలిగిన సమర్థుడు. ఒకవేళ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ తన ఇంట్లో.. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే?

ఆ దూర దృష్టితోనే ఇప్పుడు కేసీఆర్ సాధ్యమైనంత వరకు ఇంటిపోరు లేకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రాష్ట్రంలో తనకు, తన వారసులకు ఎదురులేకుండా చేయాలన్నదే ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది.

కేసీఆర్ మార్కు వ్యూహం…

అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ కైవసం చేసుకుని రెండోసారి సీఎం పీఠం అధిష్ఠించిన వెంటనే ఆయన దృష్టి ఇతర రాజకీయ పార్టీలపై, వాటిలోని సీనియర్ నేతలపై పడింది. తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్ ఉండాలి తప్ప.. ఇతర రాజకీయ పార్టీలకు ఉనికి లేకుండా చేయాలన్నది కేసీఆర్ సంకల్పంగా రాజకీయ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

అందుకే వీలైనంత వరకు ఇతర పార్టీల నాయకులను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా తనకు వ్యతిరేక పార్టీలను కుప్పకూల్చాలని, నిర్వీర్యం చేసే దిశగా పావులు కదుపుతున్నారు.

ఇప్పటికే టీటీడీపీ నిర్వీర్యం…

ఇప్పటికే టీటీడీపీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిన టీఆర్ఎస్ అధినేత, అటు కాంగ్రెస్‌లోనూ ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. తాజాగా టీటీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం వెనుక కూడా కేసీఆర్ మార్కు రాజకీయమే కనిపిస్తోంది.

మండవకు నిజామాబాద్ జిల్లాలో మంచి పేరుంది. ఆయన డిచ్‌పల్లి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పని చేసిన ఆయనకు అప్పట్లో కేసీఆర్‌తో మంచి సన్నిహిత్యమే ఉండేది. టీటీడీపీలో సౌమ్యుడిగా పేరున్న మండవ ప్రస్తుతం నివాసం ఉంటోంది కూడా హైదరాబాద్‌లోనే అయినా ఇప్పటికీ ఆయనకు నిజామాబాద్ జిల్లా నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి.

అక్కడ కవితకు వ్యతిరేకంగా…

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నిజమాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత మరోసారి ఇందూరు స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే కవితకు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఆ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు కవితపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

గత ఎన్నికలప్పుడు తాను గెలిస్తే.. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చి విస్మరించారని వారు పేర్కొంటున్నారు.

తమ సమస్యల పరిష్కారం దిశగా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న కోపంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఎలాగైనా కవితను ఓడించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేశారు. ఆ స్థానం నుంచి ఏకంగా 176 మంది రైతులు బరిలో నిలిచారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి అర్వింద్‌ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ నుంచి మధుయాష్కి కూడా మరోసారి ఈ స్థానం నుంచి బరిలోకి దిగారు.

కూతుర్ని గట్టెక్కించే చాణక్యం…

ఇక రాష్ట్రంలో 16 లోక్‌సభ సీట్లు గెలిచి తీరుతామనే నమ్మకం ఉన్న సీఎం కేసీఆర్ తన కుమార్తె పోటీలో నిలిచిన నిజామాబాద్‌‌‌లో ఆమె గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు నిజామాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెరాస ఎమ్మెల్యేలే ఉన్నారు.

కవిత గెలుపుపై వారికి ధీమా ఉన్నప్పటికీ.. సీఎం కుమార్తె కావటంతో మెజారిటీ తగ్గితే బాగుండదన్న భావన ఉంది. దీంతో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో పావులు కదిపారు.

ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు…

జిల్లాలో మంచి పట్టున్న టీటీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో కవితకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. దీంతో అందరి విషయంలోలా కాకుండా నేరుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీలో చేరమంటూ స్వయంగా ఆహ్వానించారు.

మరోవైపు 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి మండవ వెంకటేశ్వరరావు కూడా టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ స్వయంగా తన ఇంటికి రావడం, పార్టీలో చేరమని ఆహ్వానించడంతో మండవ కూడా కరిగిపోయారు.

శనివారమే ఆయన టీటీడీపీకి గుడ్‌ బై చెప్పేసి.. టీఆర్ఎస్ కారు ఎక్కేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి కూడా టీఆర్ఎస్‌లో చేరారు.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రవిచంద్ర వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇక గాయత్రి రవి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త.

మండవకు ఎమ్మెల్సీ.. ఆపైన మంత్రి పదవి?

కేసీఆర్ గతంలో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వర రావును పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మండవ వెంకటేశ్వర రావును ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అలాగే మండవ, తుమ్మల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. టీఆర్ఎస్‌లోకి మండవ రావడం వెనుక కూడా తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.

- Advertisement -