
అమరావతి: ప్రస్తుతం ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలు కానుండడంతో అన్ని పార్టీల నేతల్లో టెన్షన్ మొదలైంది. ఇకపోతే రాయలసీమలో 2014లో టీడీపీ 22 స్థానాలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు అన్ని స్థానాలు రావటం కూడా కష్టమని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీ 22 అసెంబ్లీ సీట్లను గెలవడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ హామీ. డ్వాక్రా రుణమాఫీ హామీ. వాటికి ఆశపడి చాలామంది తెలుగుదేశం పార్టీకి ఓటువేశారు. అంతకు ఐదేళ్ల కిందటివరకూ తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు పాలన చేదు ఫలితాలను చూసినప్పటికీ, రైతులు, డ్వాక్రా మహిళలు ఆశపడి ఓట్లు వేశారు.
అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం చంద్రబాబు ఆ హామీల అమలు విషయంలో దారుణంగా విఫలం అయ్యారు. పోలింగ్‌కు ముందు రైతులకు, డ్వాక్రా మహిళలకు ఏదో చిల్లర వేయడమే తప్ప.. రైతులు, మహిళలు కోరుకున్న మాఫీ మాత్రం జరగలేదు. దీంతో ఆ వ్యతిరేకత అంతా ఇప్పుడు టీడీపీకి వ్యతిరేక ఓటుగా ప్రతిఫలించడం ఖాయంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో పన్నెండు సీట్లను ఇచ్చిన అనంతపురం జిల్లా ఈసారి టీడీపీకి భారీగా కోత వేయనుంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మూడు నాలుగు సీట్లు వచ్చేలా ఉన్నాయంతే. ఇక చిత్తూరులో కూడా సిట్టింగుల మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది.
52 అసెంబ్లీ స్థానాలకు గానూ, గతంలో గెలిచిన 22లో కూడా 10 సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ కోల్పోతుందని ఒక అంచనా. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ మద్దతు, సీమలో కొద్దోగొప్పో కనిపించిన మోడీ హవా, రుణమాఫీ ప్రభావం, పదేళ్ల కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత ఉంది.
ఇవన్నీ కలుపుకుంటే యాభై రెండుకు గానూ టీడీపీకి వచ్చింది ఇరవై రెండు. ఈసారి పై ఫ్యాక్టర్లు ఏవీ తెలుగుదేశం పార్టీకి తోడులేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత అదనంగా ఉండటంతో.. టీడీపీ సీమలో సింగిల్ డిజిట్ నంబర్ సీట్లకు పరిమితం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.









Yes,Chitoor,Rayalasima,anellore, easy Godavari are at YCP 90℅ votes.