హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంటిపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 60 మందితో కూడిన అధికారుల బృందం కడప, హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించి సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేశ్ ఢిల్లీలో ఉన్నారు.
కేంద్రంతో ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి దోస్తీ బెడిసికొట్టిన నేపథ్యంలో టీడీపీ నేతలపై ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం ఉందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ వరుసదాడులు నిర్వహిస్తుండడం గమనార్హం.
ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, కావలి టీడీపీ ఇన్‌ఛార్జ్ బీద మస్తాన్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మర్నాడేవిజయవాడ, గుంటూరుల్లోని ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నాపై దాడుల వెనుక జగన్ కుట్ర: సీఎం రమేష్
తన ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ దాడుల వెనుక వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కుట్ర దాగుందని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ శుక్రవారం ఆరోపించారు. జగన్, ఆయన అనుచరుడు విజయసాయిరెడ్డి కలసి రాజకీయంగా తనను దెబ్బతీయాలన్న కుట్రతో, ప్రధాని నరేంద్ర మోడీతో కలసి ఓ పథకం ప్రకారం ఈ ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ఆయన నిప్పులు చెరిగారు.
అంతేకాదు, తనపై ఐటీ దాడులు జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ నేతలు కొందరు ముందే చెప్పారని గుర్తు చేసిన ఆయన, బీజేపీ నేతలు కూడా అలాగే మాట్లాడారని, ఇప్పుడు వారు చెప్పినట్టుగానే జరుగుతుండటాన్ని పరిశీలిస్తే.. దాడుల వెనకున్న మాస్టర్ ప్లాన్ ఎవరికైనా అర్థమవుతుందని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరిపైనా ఐటీ, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారని… తమిళనాడు, కర్ణాటకల్లోనూ అదే జరిగిందని ఆయన విమర్శించారు. తమను వ్యతిరేకించిన వారికి ఇదే గతి పడుతుందనే సందేశం ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, అయినా తాము భయపడబోమని, బీజేపీ కుయక్తులను అడ్డుకుని తీరుతామని వ్యాఖ్యానించారు.