హైదరాబాద్ : ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగద్గిరిగుట్టలో నివసించే రమ్య కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
సోమవారం ఉదయం తన ఇంటి నుంచి కాలేజీకి వెళ్లడానికి కూకట్‌పల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీ చైతన్య కాలేజీకి చెందిన బస్సు వేగంగా వచ్చి అ యువతిని ఢీకొంది . ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్య అక్కడికక్కడే మృతి చెందింది .
రమ్య మృతికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ సహ విద్యార్థులు ప్రమాదానికి కారణమైన బస్సు అద్దాలు పగులగొట్టి ద్వంసం చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.
అంతేకాదు, అదే కాలేజీకి చెందిన దాదాపు 10 బస్సుల అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేయటానికి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. దీంతో విద్యార్థులు కూకట్‌పల్లిలోని కాలేజీలను బంద్ చేయిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.