
హైదరాబాద్: గతేడాది జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 19 కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది కారు ఎక్కడం…ఉత్తమ్ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బలం 6గురు ఎమ్మెల్యేలకి పడిపోయింది.
ఈ నేపథ్యంలో కారెక్కిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..సీఎల్పీని,టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. ఇక దాని ఆధారంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసినట్లు ప్రకటన విడుదల చేశారు.
దీంతో కాంగ్రెస్ నేతలు రెండు పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఒక పిటిషన్‌ని బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు…. రెండో పిటిషన్ విచారించి…స్పీకర్‌తోపాటూ… టీఆర్ఎస్‌లోకి మారిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది.
అసెంబ్లీ కార్యదర్శి, ఈసీకి కూడా నోటీసులు పంపింది. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, ఆత్రం సక్కు, హర్షవర్ధన్, వనమా వెంకటేశ్వరరావు, సబిత, సురేందర్‌కు నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న స్పీకర్, నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది.
అయితే తాజాగా టీఆర్ఎస్ లో చేరిన గండ్ర వెంకటరమణ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు నోటీసులు ఇవ్వలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు ఈ పిటిషన్‌లు దాఖలు చేశారు. దానిపై విచారించిన హైకోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. ఇక విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది.








