కేసీఆర్ ప్రభుత్వానికి ఊరట: తెలంగాణలో ‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్ సిగ్నల్! కానీ…

Election_Commission
- Advertisement -

Election_Commission

హైదరాబాద్:  ‘రైతుబంధు’ పథకానికి ఉన్నఅడ్డంకులు తొలగిపోయాయి. బతుకమ్మ చీరల తరహాలోనే ప్రతిపక్షాలు ఈ పధకానికి కూడా అడ్డుపడతాయని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు.  అయితే ‘రైతుబంధు’ పథకం అమలుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అంగీకారంతో మార్గం సుగమమైంది. ఈ పథకం చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది. కానీ ఇందుకు కొన్ని షరతులు విధించింది.

చెక్కుల మొత్తం రైతుల ఖాతాల్లో వేయండి…

రైతుల చేతికి చెక్కులు ఇవ్వకుండా… ఆ నగదును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని ఎన్నికల కమిషన్ తెలంగాణ ఆపద్ధర్మ ప్రభుత్వానికి సూచించింది అంతేకాదు, ఈ పథకంలో కొత్తగా రైతులకు చెక్కలు పంపిణీగాని, నగదు పంపిణీగానీ చేయకుడదని ఈసీ హెచ్చరించింది.ఇప్పటికే రైతుబంధు చెక్కులను ఒకసారి అందుకున్న రైతులకు మాత్రమే రెండోవిడత చెక్కులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్పింది.

అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు…

వ్యవసాయ అధికారుల ద్వారా నేరుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయరాదని, ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఈ ‘రైతుబంధు’ పథకం కింద ఎకరానికి రూ.4 వేలు చొప్పున సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ.8 వేలు ఇవ్వనుంది.

తొలి విడత కింద ఇప్పటికే రూ.4 వేలు ఇచ్చింది. రెండో విడత రూ.4 వేలకు సంబంధించి చెక్కుల పంపిణీ జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, దీనిపై విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈసీ ఈ పథకానికి సంబంధించి రెండో విడత సహాయం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేసీఆర్ ప్రభుత్వానికి ఊరటే.

- Advertisement -