న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేసినా.. అధికారికంగా ఇంకా కాంగ్రెసులో చేరలేదు. కానీ కాంగ్రెసు పార్టీకి ఆయన పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోకూడా డీఎస్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. శుక్రవారం కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన సోనియా గాంధీతో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది.
అప్పటి నుంచి టీఆర్ఎస్‌కి దూరంగానే…
డి.శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కల్వకుంట్ల కవిత సహా నిజామాబాద్ టీఆర్ఎస్ నాయకులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావును కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అప్పటి నుంచి డీఎస్ టీఆర్ఎస్‌కి దూరంగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కేసిఆర్‌ను కలవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు.
అయితే పార్టీ వ్యవహారాలు అన్నీ ఫోన్‌లోనే చక్కబెడతారనే పేరు డీఎస్‌కు ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు. అంతేకాదు, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన రెండుసార్లు ( 2004, 2009 ) కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ రెండుసార్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
అలాగే డీఎస్‌కు కాంగ్రెస్ నాయకులతో విస్తృతమైన సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సలహాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెర వెనక ఉండి కాంగ్రెస్ గెలుపు కోసం…?
అయితే ఆయన అధికారికంగా ఇంకా కాంగ్రెస్‌లో చేరనప్పటికీ.. ఇటీవల రాహుల్ గాంధీతో సమావేశం కావడం, అలాగే శుక్రవారం సోనియాగాంధీతో సమావేశం కావడం చూస్తోంటే.. ప్రస్తుత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో డీఎస్ తెర వెనక ఉండి కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తున్నారనే ఊహాగానాలు జోరుగా చెలరేగుతున్నాయి.