
హైదరాబాద్: గత నెల తెలంగాణలోని ఎంపీటీసీ,జెడ్పీటీసీ స్థానాలకి మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మొత్తం 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఇక మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.
అయితే జులై 3న ఎంపీపీ, జులై 4న జెడ్పీఛైర్మన్‌ల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకారం ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రమాణస్వీకారం చేయకుండానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీచేసింది. అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేసినట్లు ప్రకటించింది.








