
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఓ పెళ్లిని మాత్రం అడ్డుకోలేకపోయింది. కాకపోతే ఘనంగా జరగాల్సిన పెళ్లి సాదాసీదాగా జరిగింది.
కేవలం 18 మంది సమక్షంలో జరిగిన ఈ పెళ్లి హైదరాబాద్‌లోని ఓల్డ్‌బోయిన్‌పల్లిలో జరిగిందీ ఘటన. స్థానిక రాజరాజేశ్వరినగర్‌కు చెందిన నిషిత రెడ్డి, ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డి వివాహం మూడు నెలల కిందటే నిశ్చయమైంది.
నిన్న బోయిన్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాలులో వీరి పెళ్లి ఘనంగా జరగాల్సి ఉంది. అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు.
అయితే, ఇప్పట్లో మంచి ముహూర్తం లేకపోవడంతో ఆరేడు నెలలు ఆగాల్సి వస్తుందని భావించిన ఇరు కుటుంబాల సభ్యులు వివాహం జరిపించేందుకు నిర్ణయించారు.
అయితే, ఫంక్షన్‌హాలులో కాకుండా వధువు ఇంటి వద్దే జరిపించాలని నిశ్చయించారు. వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మొత్తం 18 మంది సమక్షంలో ముందుగా నిర్ణయించిన సమయానికే వివాహాన్ని జరిపించారు.
ఇందులో ఓ విశేషం కూడా ఉంది. పెళ్లిలో అందరూ భౌతికదూరం పాటించి వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.








