టీడీపీకి షాక్: నందమూరి సుహాసినిని చిత్తుగా ఓడిస్తాం: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ నాయకుల హెచ్చరిక, నిరసన!

congress leaders protest against nandamuri suhasini in kukatpally
- Advertisement -

congress leaders protest against nandamuri suhasini in kukatpally

హైదరాబాద్‌: మహాకూటమి తరపున కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేయడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి స్థానాన్ని తెలుగుదేశంకి కేటాయించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ స్థానాని తొలుత టీ-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డికి కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అనూహ్యంగా సుహాసినిని తమ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. నందమూరి కుటుంబానికి టికెట్‌ కేటాయించడం వల్ల సానుభూతిని పొందవచ్చనే కారణంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పార్టీ టికెట్ స్థానికులకు ఇవ్వకుండా…

ఈ టికెట్‌ను స్థానికులకు కాకుండా నందమూరి ఫ్యామిలీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ..  కేపీహెచ్‌బీ రోడ్‌ నంబర్‌ 1లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పార్టీ టికెట్‌ కేటాయించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సమర్ధుడైన నాయకుడు రెబల్‌గా బరిలో నిలిపి సుహాసినిని  చిత్తుగా ఓడిస్తామని వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాల్లో ఆంధ్రలో చేసుకోవాలి గానీ తెలంగాణలో కాదు అంటూ వారు హితవు పలికారు.

- Advertisement -