హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలలో మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దాసోజు శ్రవణ్‌కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బుదవారం ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్‌కుమార్ తరపున నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన సహచరులు ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్ళారు
అయితే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కుమార్ లేకపోవడం, అలాగే అభ్యర్థిని ప్రతిపాదించిన ఓటరు కూడా ప్రత్యక్షంగా లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారి ముషారఫ్ ఫారుఖీ నిరాకరించారు.
అయితే ఇతరుల తరపున నామినేషన్లను స్వీకరించాలంటే అభ్యర్థి ప్రత్యేకం కానీ, ఆయన ప్రతిపాదించిన ఓటరు కానీ తప్పకుండా ఉండాలని, దాసోజు విషయంలో అ ఇద్దరు లేకపోవడంవల్లే నామినేషన్‌ను తీసుకోలేదని అధికారి తెలిపారు.
రిటర్నింగ్ అధికారి ఛాంబర్ నుంచి 100 మీటర్ల పరిధి వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని, నామినేషన్ వెయ్యడం కోసం వచ్చే అభ్యర్థుల అనుచరులుగాని, ఇంకా ఎవరైనగాని నినాదాలు చేయకూడదని తెలిపారు. అలాగే పోటి చేసే అభ్యర్థితో పాటు కేవలం నలుగురికి మాత్రమే కార్యాలయ గేటు లోపలికి అనుమతిస్తామని, ఈ విషయమై రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించరాదని రిటర్నింగ్ అధికారి సూచించారు.