రామచంద్రపురం: రైల్వే స్టేషన్‌లోని ఓ గదిలో తోటి ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్ళితే… తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం రైల్వే స్టేషన్‌లో మహ్మద్ రియాజ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నాడు. ఇదే స్టేషన్‌లో ఓ వివాహిత గేట్ కీపర్‌గా సుమారు సంవత్సరం నుంచి పని చేస్తోంది.
గదిలోని ఓ రహస్య ప్రదేశంలో కెమెరాను అమర్చి…
ఈ క్రమంలో కొద్దికాలంగా స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్ ఎత్తివేయడంతో ఖాళీగా ఉన్న ఆ గదిలో మహిళా ఉద్యోగి దుస్తులు మార్చుకుని యూనిఫాం వేసుకుంటూ ఉంటుంది. అ విషయన్ని గమనించిన స్టేషన్ సూపరింటెండెంట్ రియాజ్.. ఆ గదిలోని ఓ రహస్య ప్రదేశంలో కెమెరా అమర్చి ఆమె దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణకు పాల్పడ్డాడు.
ఈ దారుణం కొంతకాలంగా సాగుతుండగా.. బుధవారం గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాకు ఉన్న చిన్న ఎల్‌ఈడీ బల్బు వెలుగు కనిపించడంతో ఆమెకు అనుమానం వచ్చి తీసి చూడగా రియాజ్ బాగోతం బయటపడింది. దీంతో సూపరింటెండెంట్ ల్యాప్‌టాప్‌లో చూస్తే దానిలో ఆమెకు తన వీడియోలు కనిపించాయి. దీంతో బాధితురాలు ఆ విషయాన్ని పైఅధికారులకు ఫిర్యాదు చేసింది.
సూపరింటెండెంట్ సస్పెన్షన్…
అధికారుల ఫిర్యాదు అందుకున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సతీష్ వెంటనే తన సిబ్బందితో రామచంద్రపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుని రహస్య చిత్రీకరణను నిర్ధారించారు. కెమెరాను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి రైల్వే డీఆర్‌ఎంకు నివేదిక అందించారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సతీష్ నివేదిక ఆధారంగా డీఆర్‌ఎం ఆదేశాల మేరకు నిందితుడు మహ్మద్ రియాజ్‌ను సస్పెండ్ చేశారు.