
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె 16వ రోజుకు చేరిన నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మిక నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలంటూ హైకోర్టు ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల ప్రకారం.. 19వ తేదీ ఉదయమే ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. అంతేకాదు, ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలను ఈనెల 21లోపే చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు…
అంతేకాకుండా, హైకోర్టు ఆదేశాల కాపీ తమకు ఇంకా అందలేదని పేర్కొంటూ కార్మిక నేతలతో చర్చలను ప్రభుత్వం దిగ్విజయంగా దాటవేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై వారు సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని, ఈ నెల 30 వరకు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలు జరపకుండా ప్రభుత్వమే మొండివైఖరి అవలంభిస్తోందంటూ కార్మిక సంఘాలు, పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిత్వం వహించే విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు కూడా కొంత ప్రయత్నం చేసినా.. ప్రభుత్వం వైపు నుంచి అనుకూల సంకేతాలు రాకపోవడంతో అదీ జరగలేదు.
మరోవైపు తనను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులతో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడరాదని, ప్రభుత్వంతో తాను మాట్లాడతానని ధైర్యం చెప్పారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె విషయంలో ఏం చేయాలన్నదానిపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మరి సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారో, అసలు ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తుందా? గవర్నర్ తమిళిసై దీనిపై ఎలా స్పందించబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!








