
హైదరాబాద్: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అనుకున్న మేర సీట్లు సాధించలేకపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఆపార్టీ 9 చోట్ల విజయం సాధించింది. ఇక ఎవరు ఊహించని విధంగా బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించాయి. అలాగే ఎంఐఎం తన సీటు హైదరాబాద్‌ని సొంతం చేసుకుంది.
అయితే టీఆర్ఎస్ ఇందులో నాలుగు స్థానాలు ప్రధానంగా నలుగురు మంత్రుల నిర్లక్ష్యం వలన ఓడిపోయిందంటా. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టుబట్టి మరీ తన కుమారుడు సాయికిరణ్ ను బరిలోకి దింపారు. కానీ అక్కడ బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి ఎదురయింది.
అసలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ లో కూడా టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడాన్ని పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
అటు మల్కాజిగిరి స్థానాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఏరికోరి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో రాజశేఖర్ ఓటమి పాలయ్యారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ కు మెజారిటీ రాలేదు.
అటు ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి నగేష్ కూడా ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్ధి సోయమ్ బాపూరావు విజయం సాధించారు. ఇక్కడ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నిర్మల్ లో టీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో ఉండటం గులాబీ వర్గాలని షాక్ కి గురిచేస్తుంది.
నిజామాబాద్ లో కవిత…
ఇక నిజామాబాద్ పార్లమెంటుకు పోటీచేసిన కేసీఆర్ తనయ కవిత ఓటమిపై గల కారణాలను కూడా లోతుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కలసి పోవడం వల్లనే కవిత ఓటమి పాలయ్యారని చెబుతున్నా… అక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ రాకపోవడాన్ని వేలెత్తి చూపుతున్నారు.
పైగా నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయిన సరే ఇక్కడ బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.








