షాకింగ్: ఔటర్ రింగు రోడ్డుపై అగ్నిప్రమాదం, కళ్లెదుటే కాలిపోయిన బస్సు…

5:32 pm, Mon, 8 July 19
bus-in-fire-on-outer-ring-road

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైంది.  నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ ఎగ్జిట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 

భూమా ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఇంజన్‌లో లోపం కారణంగా హఠాత్తుగా బస్సులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును రోడ్డుపైన ఓ పక్కగా నిలిపేసి కిందకి దిగిపోయాడు.

కళ్లెదుటే దగ్ధమైపోయిన బస్సు…

అంతలోనే బస్సులో మంటలు లేచాయి. చూస్తుండగానే బస్సు మొత్తం అంటుకుని ఆ మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ఔటర్‌ రింగ్ రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లి మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.