23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యేలు సబిత, హరిప్రియ! కేటీఆర్‌తో భేటీ

కాంగ్రెస్‌కు భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యేలు సబిత, హరిప్రియ! కేటీఆర్‌తో భేటీ

haripriya-sabitha
- Advertisement -

హైదరాబాద్‌/ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సబితారెడ్డి, బానోతు హరిప్రియ టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడైన కార్తీక్‌రెడ్డితో కలిసి ఆదివారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మజ్లిస్‌పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవితలతో చర్చలు జరిపారు.

సబితతోపాటు హరిప్రియ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి..

ఈ క్రమంలో ఆమె టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఇది ఇలావుంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కూడా.. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు లేఖ విడుదల చేశారు. అవసరమైతే తాను రాజీనామా చేసి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని ఆమె స్పష్టం చేశారు.

సబితారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వారం రోజుల క్రితం వారు ఎంపీ అసదుద్దీన్‌తో ఈ విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా ఆదివారం ఉదయం మరోసారి వారు అసద్‌ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటికే కేటీఆర్‌ అక్కడికి వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరే అంశంపై తుది దఫా చర్చలు జరిగాయి. సబితకు మంత్రి పదవితో పాటు చేవెళ్ల ఎంపీ స్థానం కార్తీక్‌రెడ్డికి ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగింది.

టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి పేరు ప్రచారంలోకి వస్తున్నందున ఈ అంశం మీద కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. చివరికి ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత సబితారెడ్డి, కార్తీక్‌లు కొండాపూర్‌లోని ఎంపీ కవిత నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇదే అంశంపై చర్చించారు. సీఎం కేసీఆర్‌కు తాను తెలియజేస్తానని కవిత వారికి చెప్పారు.

ఈ క్రమంలో త్వరలోనే సీఎంతో భేటీ కావాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి .. టీఆర్ఎస్, మజ్లిస్‌ నేతలను కలిసి వెళ్లిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీలు కలిసి వారిని సముదాయించేందుకు యత్నించినా వినలేదని తెలిసింది.

ఇప్పటికే టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలు గులాబీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా మరో ఇద్దరిపై స్పష్టత రావడంతో పార్టీని వీడే వారి సంఖ్య 5కు చేరింది. దీంతో కాంగ్రెస్‌ బలం 19 నుంచి 14కి తగ్గనుంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీలో చేరేవారు మాత్రం తాము కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.

చదవండి: ప్రధాని నరేంద్ర మోడీపై విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు
- Advertisement -