
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ తొలిదశలోనే పూర్తవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఇదే దశలో తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు పూర్తవుతాయి. మార్చి 18న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 25 నామినేషన్లకు చివరిరోజు కాగా, మార్చి 26న నామినేషన్లు పరిశీలిస్తారు. మార్చి 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఫలితాలు మాత్రం దేశవ్యాప్తంగా అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే 23న విడుదల చేస్తారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటుగా 2014 అసెంబ్లీ ఎన్నికలను ఈసీ తుది దశలో నిర్వహించగా, ఈ దఫా తొలి విడతలోనే ఏపీ శాసన సభ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడం అందరిని కొంచెం షాక్‌కు గురిచేసింది.
గత ఎన్నికల్లో అనూహ్య రీతిలో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఈ సారి ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉండగా, అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ సమీక్షలు నిర్వహిస్తూ టికెట్లు పంపిణీ చేయడం పార్టీలోనే లుకలుకలు సృష్టిస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే అధినేత జగన్ వద్ద పూర్తి స్థాయి లిస్ట్ తయారుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వలసలు ఆహ్వానిస్తున్నా, ఆయా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థిని కన్ఫార్మ్ చేసి అనధికారికంగా వారికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఏపీలో పోలింగ్‌కు సరిగ్గా మరో 30 రోజులే గడువు ఉండటంతో వైసీపీ, టీడీపీ పూర్తి స్థాయిలో రంగంలోనికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే దాదాపుగా రెండు నెలల సమయం ఉంటుంది అనుకోని ప్రణాలికలు వేసుకున్న బాబు ఈసీ ప్రకటించిన షెడ్యూల్ చూసి షాక్ అయ్యాడు. గతంలో మాదిరిగానే తుది విడతలో ఏపీ ఎన్నికలు ఉంటాయని భావించిన చంద్రబాబుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.








