హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ సహా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొనియాడుతుంటే.. కాంగ్రెస్ దద్దమ్మలు, ఇతర విపక్షాలకు చెందిన నేతలకు అది కనిపించడం లేదని, వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
గురువారం తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, రాష్ట్ర అభివృద్ధిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తమ కాకిగోల ఆపడం లేదని మండిపడ్డారు. విపక్ష నేతలు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా తెలంగాణ దరిదాపుల్లో లేదని చెప్పారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ దద్దమ్మలు, విపక్షాలకు చెందిన నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇంత ప్రగతిని సాధించే క్రమంలో తనకు సహకరించిన తన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.