2019 లోక్‌సభ ఎన్నికలు: పట్టు లేని.. ప్రాంతీయ పార్టీలు

- Advertisement -

 

అసలు.. కేంద్ర ప్రభుత్వంలో నామమాత్రంగా ఉన్న ప్రాంతీయ పార్టీల హవాను ఒక వెలుగు.. వెలిగేలా చేసిన ఘనత.. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. అందుకు నాందీ ప్రస్థానం పలికింది మాత్రం దివంగత ఎన్టీఆర్ కావడం.. ఆయన మన తెలుగువారు కావడం గర్వకారణం.

ఆరోజున కాంగ్రెస్‌ను గద్దె ఎక్కకుండా చేసేందుకు.. ప్రాంతీయ పార్టీలనన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి విజయం సాధించి.. కేంద్ర సింహాసనం కాంగ్రెస్ సొత్తు కాదని నిరూపించి.. ఒక దారి చూపించారు ఎన్టీఆర్. అలా మొదలైంది.. ప్రాంతీయ పార్టీల ప్రస్థానం. తర్వాతి కాలంలో నెమ్మదిగా పెద్ద పార్టీలన్నీ.. ప్రాంతీయ పార్టీలపై ఆధారపడటం సర్వసాధారణమై పోయింది.

1989-1991 మధ్య కాలంలో రాజకీయాల్లో నూతన శకం..‘థర్డ్ ఫ్రంట్’ ఆవిర్భావం 

థర్డ్ ఫ్రంట్ తర్వాత రకరకాల అలయెన్స్ ల పేరుతో ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించాయి. అయితే 1989-91 కాలంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి ప్రాంతీయ పార్టీల ప్రతినిధిగా జనతాదళ్ నాయకత్వంలో ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి వి.పి.సింగ్… ఆ తర్వాత అతని స్థానంలో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది.. తెరముందు ఎన్టీఆర్ ఉన్నా.. తెరవెనుక సారథ్యమంతా చంద్రబాబునాయుడేనన్నది జగమెరిగిన సత్యం..మొత్తానికి ప్రాంతీయ పార్టీలు కూడా ఢిల్లీ పీఠం అధిరోహించగలవని వీరిద్దరూ నిరూపించారు. వీరితో పాటు ముఖ్య పార్టీలు డీఎంకే (తమిళనాడు), అసోం గణ పరిషత్ (అసోం), ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు).. వీరు ప్రధాన పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం గమనార్హం.

ప్రాంతీయ పార్టీల వైఫల్యాలకు ఉదాహరణలెన్నో.. కేంద్ర మాజీ రైల్వే మంత్రి  లాలూ ప్రసాద్ యాదవ్ సంగతి..

ప్రాంతీయ పార్టీల్లో వారిలో వారు కొట్టుకోవడం, ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ.. మెజార్టీ ఎంపీలున్న స్టేట్స్ కి ధారాదత్తం చేయడంతో.. వారు వాటిని దుర్వినియోగం చేసి.. దేశాన్ని వదిలేసి తమ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేయడం లాంటివి చేశారు. ఇందులో ముఖ్యంగా రైల్వే మంత్రులుగా చేసిన మమతా బెనర్జీ , లాలూ ప్రసాద్ యాదవ్ లను చెప్పాలి .. వారి సొంత రాష్ట్రాల్లో అభివృద్ధి లేని ప్రాంతాల్లో రైల్వే లైన్లు వేసి.. రైల్వే శాఖను మరింత నష్టాల్లో ముంచేశారు. ముఖ్యంగా కొన్ని ఉద్యోగాలైతే.. ఒకానొక దశలో బీహార్  వారికి మాత్రమే వచ్చేవి.అంతేకాకుండా లాలూ ప్రసాద్ వేసిన రైల్వే లైన్లు లాభాల్లేక ఇప్పుడు చాలామటుకు మూసేశారు. అక్కడ  కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అయితే చేసిన మంచి పని కూడా ఉంది..అది లాలూ హయాంలోనే తత్కాల్ ప్రవేశ పెట్టి రైల్వేకు ఒక మంచి ఆదాయవనరు చూపంచగలిగారు. అయితే ఆయన గడ్డిస్కామ్ లో అవినీతి పరుడిగా ముద్రపడటం.. ఆయనలాంటి వాళ్లు కేంద్ర మంత్రి పదవులు అధిరోహించడం లాంటివి తప్పని సరిగా చేయడంతో  ప్రాంతీయ పార్టీల ఔచిత్యం కోల్పోవడం, అదే సమయంలో ప్రధాన పార్టీల బలహీనతలు మరింత బయటపడ్డాయి.

ఇక కేంద్ర మాజీ రైల్వే మంత్రి మమతా బెనర్జీ.

రెండుసార్లు కేంద్ర రైల్వే శాఖామంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ.. కమ్యూనిస్టుల భావజాలాన్ని ఇక్కడా ప్రదర్శించారు. వీరు పెట్టుబడీ దారి వ్యవస్థకు వ్యతిరేకం.. ఎప్పుడైతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదో.. యువతకు ఉపాధి అవకాశాలుండవు.. అందుకే వారు ఇతర రాష్ట్రాలకు భార్యాబిడ్డలను వదిలి నెలల తరబడి వెళ్లిపోతుంటారు. ఫ్యాక్టరీల్లో కూలీలుగా, భవన నిర్మాణ రంగంలో కార్మికుల్లా, భారీ ప్రాజెక్టుల్లో కూలీలుగా వెళ్లిపోతుంటారు. ఎంతో దయనీయమైన పనులు చేస్తుంటారు. అందుకే మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా పనిచేసిన తర్వాత ఇతర రాష్ట్రాలకు తమ యువత వెళ్లేందుకు వీలుగా రైళ్లలో చాలావాటిని కొల్ కతా వరకు పొడిగించేసింది. కొన్నింటిని గౌహతీ వరకు వెళ్లేలా మార్చి పడేశారు. అలా కొనసాగిన వాటిలో మన విశాఖ ఎక్సెప్రెస్ కూడా ఒకటి.. సాధారణంగా బెంగాల్, బీహార్ వాళ్లకు గుట్కా, పాన్ పరాగ్ లు తినే అలవాటు ఉంటుంది. అంతే కాకుండా అంత దూరపు ప్రయాణాల రైళ్లలో నీటి వసతి ఏర్పాటు చేయలేరు. దీంతో అటువైపు రైళ్లన్నీ దుర్గంధ పూరితంగా మారిపోయాయి.

ఇది ప్రజల తప్పు కాదు..

వారికి ఒక బ్రేక్ జర్నీలా ఇస్తే..కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అదీకాక..విద్యావంతులు.. అక్కడే ప్రభుత్వ పథకాలు ఉపయోగించి  పశ్చిమ బెంగాల్లో ఆర్థికస్వావలంభన పొందుతున్నారు.  చదువులేని వారు కూలీ పనులకు వెళ్లేవారు.. ఈ రైళ్ల పై ఆధారపడి..వెళుతూ..వారికి తోచిన విధంగా రైళ్లను ఉపయోగిస్తున్నారు. నిజానికి కోల్ కతా వైపు వెళ్లే ఏ రైలు ప్రయాణం చేయాలన్నా..అది ఒక నరకంలా భావించే స్థితికి మన మమతమ్మ చేసేసిందనడంలో సందేహమే లేదు. ఆమెను అనడానికి లేదు. కమ్యూనిస్టులందరూ పేద ప్రజల పక్షాన పోరాడతారు. మరి వాళ్లు కూడా అలాగే జనరల్ కంపార్ట్ మెంట్ లో గౌహతీ నుంచి ఢిల్లీ వరకు వెళితే బెంగాలీలు కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి.

లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగులోకి..

తమిళనాడులో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చి కీలక మంత్రి పదవులు తీసుకున్న డీఎంకే పార్టీ.. అవినీతి కుంభకోణాల్లో అప్రదిష్ట మూటకట్టుకుంది. అలాంటి వాటిలో 2జీ స్పెక్ట్రమ్ ఒకటి.. అయితే తర్వాత అది రూల్స్ ప్రకారమే ఇచ్చారని కూడా పేర్కొన్నారు. అయితే ప్రజాప్రతినిధులే వ్యాపారాలు చేయడం, వాటికి అనుమతులు తెచ్చుకోవడం సరికాదని పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవచేయడానికి గానీ..వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించకూడదనేది ఒక నిష్ఠూర సత్యం. ఆంధ్రాలో ఇదే మాట  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనడం..వివాదస్పదమైంది. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా పారిశ్రామిక వేత్తలు మంత్రులుగా ఉన్నారనే అంశంపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆదాయపు పన్ను శాఖాధికారుల దాడుల్లో ఇబ్బందులెదుర్కొంటోంది. కేవలం పారిశ్రామిక వేత్తలకు పదవులు ఇవ్వడం కారణంగా ఈ పరిస్థతిని  ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఇది ఒక ఆయుధంలా బీజేపీకి లాభించింది.

యూపీఏ-2 సర్కారులో  (ప్రాంతీయ పార్టీల) భారీ కుంభకోణాలు

upa govt

అయితే కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ-2 సర్కారులో  భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయి. ఇవి కోర్టుల జోక్యంతో వెలుగులోకి  రావడం విశేషం. 2 జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి నాటి టెలికామ్ మంత్రిగా ఉన్న ఏ.రాజా (డీఎంకే) మంత్రి పదవిని కోల్పోయారు.  2010 నవంబర్ 14న రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇదే పార్టీకి చెందిన దయానిధి మారన్ ఎయిర్‌సెల్ కంపెనీ మలేషియాకు చెందిన మాక్సిక్‌కు విక్రయించాలని ఒత్తిడి తెచ్చిన వ్యవహారంలో 2011 జూలైలో కేంద్ర మంత్రిత్వ శాఖ పదవికి రాజీనామా చేశారు. శశిథరూర్ 2010 ఏప్రిల్ లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కారణం సునంద పుష్కర్ కు (భార్య, ప్రియురాలు) ఐపీఎల్ లో కోచి క్రికెట్ టీమ్ యజమాని సంస్థ రెండెజ్ స్పోర్ట్స్ వరల్డ్ లో వాటాలున్నాయనే ఆరోపణలు రావడంతో వ్యవహారం వివాదస్పదమై రాజీనామాకు పరిస్థితి  దారితీసింది. వ్యవహారం సద్దుమణిగాక మళ్లీ కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి పదవి ఇవ్వడంతో  కాంగ్రెస్ పార్టీ పరువు మరింత మసకబారి పోయింది.

ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వీరభద్ర సింగ్ అంతకు ముందు కేంద్ర ఉక్కు శాఖామంత్రిగా ఉన్నారు. ఆయనపై, ఆయన భార్యపై హిమాచల్ ప్రదేశ్‌లో ఒక కోర్టు అవినీతి కేసులో అభియోగాలను నమోదు చేయడంతో రాజీనామా చేశారు. ఇంకా  రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్, న్యాయశాఖామంత్రి అశ్వనీ కుమార్ కూడా అవినీతి ఆరోపణలతోనే రాజీనామా చేశారు. బొగ్గు కుంభకోణం దర్యాప్తు నివేదిక వివరాలను కోరడమే కాకుండా మార్పులు సూచించినందుకు అశ్వని కుమార్, మేనల్లుడి లంచం వ్యవహారంలో బన్సల్ కుమార్‌లు రాజీనామా చేశారు. ఇలా యూపీఏ-2 అవినీతిమయ ప్రభుత్వంగా మారడంతో.. బీజీపీకి చేజేతులారా అవకాశమిచ్చినట్లయింది. వీటిలో అధికశాతం సొంత పార్టీ వారు కాకుండా ప్రాంతీయపార్టీల వల్ల జరిగిన నష్టమే ఎక్కువని చెప్పాలి.

1996-1998 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు

మళ్లీ 1996లో జనతాదళ్, సమాజ్ వాదీ పార్టీ, టీడీపీ, డీఎంకే, ఏజీపీ (అసోం గణ పరిషత్), ఆల్ ఇండియా కాంగ్రెస్ (తివారి), లెఫ్ట్ ఫ్రంట్ (నాలుగు పార్టీలు), తమిళ మున్నేట్ర కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్,  మహారాష్ట్ర వాదీ గోమంత్క్ పార్టీ.. ఇలా 13 పార్టీలు కలిసి యునైటైడ్ ఫ్రంట్ గా ఏర్పడి మళ్లీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అప్పుడు కూడా వీరందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి చంద్రబాబునాయుడే కీలక పాత్ర పోషించడం విశేషం.  ఆ సమయంలో యునైటైడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా కూడా ఆయన ఉన్నారు.  ఈ ఎపిసోడ్ కి ముందు.. అప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 140 సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానం వచ్చింది. వాజ్ పేయ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే బలనిరూపణలో మిగిలిన 13 సీట్లు చూపించలేక పోవడంతో.. కేవలం 13 రోజుల్లో ప్రభుత్వం పడిపోయింది.

ఆ సందర్భంలో జనతాదళ్ ముందుకువచ్చి యునైటైడ్ ఫ్రంట్ ఏర్పాటుచేసింది. 1996 ఏప్రిల్ 21న హెచ్ డి దేవెగౌడ (కర్ణాటక) ప్రధాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సంవత్సరానికే లుకలుకలు బయలుదేరడంతో 1997 ఏప్రిల్ 21న ఐకే గుజ్రాల్ (పంజాబ్) ప్రధానిమంత్రిగా పనిచేశారు. మార్చి 1998 వరకు అంటే సుమారు ఏడాదిపాటు పని చేశారు. అయితే ప్రాంతీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరూ పట్టుమని ఏడాదికూడా ప్రధానిగా కొనసాగకపోవడంతో ప్రజలకు ప్రాంతీయ పార్టీలపై విశ్వసనీయత తగ్గింది. కేవలం తమ స్వార్థానికి కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా ఎదగాలని భావించడమే తప్ప..దేశానికి ఒరిగిందేమి లేదని గత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

మసకబారిన ప్రాంతీయపార్టీల విశ్వసనీయత..

నిలకడ లేనితనం.. స్వార్థం, దేశ వ్యాప్త కాంట్రాక్టులు కొట్టేయడం, తమ రాష్ట్రానికే అపరిమిత ప్రాధాన్యమివ్వడం..ఇలా ఎన్నో..

అయితే విభిన్న ప్రాంతీయ తత్వాలు, ఒకొక్క పార్టీకి భావ సారూప్యతలో వ్యత్యాసాలు, అభిప్రాయ భేదాలు, ఒక పార్టీతో ఒకరికి పడకపోవడం, దేశంమీద ప్రేమకన్నా అధికారంపైనే మక్కువ చూపించడం, కేవలం ప్రాంతీయ పార్టీలు కలిసి తమకనుకూలంగా కొన్ని కోట్ల రూపాయల  కాంట్రాక్టులు పొందడం, భారీగా లబ్ధిపొందడం, తమ రాష్ట్రాల్లో సులువుగా అనుమతులు సాధించడం, ఒక రాష్ట్రం వారు ..వరే రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, ఇలా చిల్లర పార్టీలన్నీ కలిసి.. కేవలం దేశ సేవ కన్నా స్వయం సేవపై..తాము మరింత గొప్పవారిగా ఎదిగేందుకు వీటిని సాధనాలుగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు.ఇలా ప్రాంతీయ పార్టీలు సొంతలాభాలను, ప్రయోజనాలను చూసుకొని.. ప్రజలపై విశ్వసనీయత లేకుండా చేసుకున్నారు. సెక్యులర్ భారత దేశంలో..మతాలు, ప్రాంతాలు, కొన్ని వేల కులాలు, డబ్బులు ఇలా ఎన్నో ప్రభావితం చూపిస్తుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఏక సారూప్యత ఉన్న పార్టీలే అధికారంలో ఉంటే..భవిష్యత్తు భారతదేశం బాగుంటుంది.

 

-శ్రీనివాస్ మిర్తిపాటి

- Advertisement -

1 COMMENT