27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్

ఆలోగా నేను స్వర్గంలో ఉంటా: ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది అదిల్

- Advertisement -

adil ahmad

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాదికి సంబంధించిన ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియోను ఉగ్రవాద సంస్థ ‘జైష్‌ ఎ మహ్మద్‌ (జేఈఎం)’ విడుదల చేసింది. సదరు వీడియోలో ఉగ్రవాది అదిల్‌ అహ్మద్ దార్ అలియాస్‌ వకాస్‌ అత్యాధునిక తుపాకులు, జేఈఎం జెండా, బ్యానర్లతో కనిపించాడు.

అంతేగాక, ‘నా పేరు అదిల్‌. ఏడాది క్రితం జేఈఎంలో చేరాను. సంవత్సరం వేచి చూశాక, నాకీ అవకాశం వచ్చింది. ఈ వీడియో మీకు చేరేటప్పటికి నేను స్వర్గంలో ఉంటాను. కాశ్మీర్‌ ప్రజలకు ఇదే నా చివరి సందేశం’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు అదిల్. దక్షిణ కాశ్మీర్‌లోని ప్రజలు భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఇప్పుడు వారితో జతకట్టేందుకు ఉత్తర, మధ్య కాశ్మీర్‌, జమ్ము ప్రజల వంతు వచ్చిందని పేర్కొన్నాడు.

తమలో కొంతమంది ఉగ్రవాదుల్ని చంపడం ద్వారా, తమను బలహీన పరచలేరని అదిల్ అన్నాడు. ఇటీవల కాశ్మీర్‌లో భద్రతా బలగాలపై చేపట్టిన దాడుల్ని ప్రస్తావించాడు. గతంలో జేఈఎం చేపట్టిన ఐసీఏ18 విమానం హైజాకింగ్‌, 2001 పార్లమెంట్‌పై దాడి, నగ్రొటా దాడి, యురి దాడి, పఠాన్‌కోట్‌ ఐఏఎఫ్‌ స్థావరంపై దాడి గురించి గొప్పగా చెప్పడం గమనార్హం.

మధ్యలోనే బడి మానేసి.. ఉగ్రవాదం వైపు..

ఇక అదిల్‌ అహ్మద్‌‌ది జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లా గుండిబాగ్‌. పాఠశాల చదువు మధ్యలోనే మానేసి, భవన నిర్మాణ పనులు చేస్తూ, స్థానిక మసీదులో ప్రార్థనలు నిర్వహించేవాడు. ఇతన్ని ‘అదిల్‌ అహ్మద్‌ గాడి టక్రానేవాలా’, ‘వకాస్‌ కమాండో ఆఫ్‌ గుండిబాగ్‌’ అని కూడా వ్యవహరిస్తారు. అదిల్‌ తన ఇద్దరు స్నేహితులు తౌసీఫ్‌, వసీంలతో కలిసి 2016, మార్చి 19న కనిపించకుండా పోయినట్లు పోలీసులు వెల్లడించారు. తౌసీఫ్‌ సోదరుడు, ఉగ్రవాది మంజూర్‌ అహ్మద్‌ దార్‌ 2016లో మృతి చెందాడు. 2017లో జేషే ఆపరేషనల్ చీఫ్ ఖలీద్‌ను భద్రతా దళాలు బారాముల్లాలో మట్టుబెట్టాయి.

కాగా, గురువారం ఈ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో 43మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు. యురి ఘటన తర్వాత ఇదే పెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. స్థానికంగా ఉండే సానుభూతిపరులు సహకరించడంతో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.

చదవండి: అతిపెద్ద ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి, 40 మంది జవాన్లు మృతి

- Advertisement -