డెహ్రాడూన్: దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఘన నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మాజీ సైనికులు, అమర జవాన్ల సన్మాన కార్యక్రమం ‘శౌర్య సమ్మాన్ సమరోహ్’జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అమరజవాన్ల కుటుంబసభ్యులను సన్మానించారు. అమర జవాన్ల తల్లులను, సతీమణులను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వీర జవాన్ల తల్లులకు పాదాభివందనం చేసి సైనికుల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.
పాదాలకు నమస్కరించేందుకు మంత్రి కిందకు వంగుతుండగా.. కొందరు అమర జవాన్ల తల్లులు వారించే ప్రయత్నం చేశారు. అయినా, సీతారామన్ వారికి పాదాభివందనం చేశారు. కేంద్రమంత్రి చర్యను అక్కడున్న వారంతా చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
आज @nsitharaman जी ने देहरादून में एक पूर्व सैनिक सम्मेलन में प्रतिभाग किया । जब उत्तराखंड के अमर शहीद अजीत प्रधान,सेना मेडल सम्मानित,की माँ हेम कुमारी जी उनका स्वागत करने पहुँचीं तो निर्मला जी ने तुरंत आगे बढ़ कर उनके पाँव छुए।
हम सभी पूर्व सैनिकों का सर गर्व से ऊँचा हो गया । pic.twitter.com/Etsg8Rc0ZR
— Ganesh Joshi (@ganeshjoshibjp) March 4, 2019
కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి సీతారామన్ మాట్లాడుతూ.. ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడంపై మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.500 కోట్ల రూపాయలే మంజూరు చేసిందని.. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఆర్మీ మాజీ ఉద్యోగులకు అందజేసిందన్నారు.
అమరుల స్మారక స్థూపంపై కూడా విమర్శలు చేయడం తగదని ప్రతిపక్షాలకు మంత్రి హితవు పలికారు. గత 60ఏళ్లుగా స్మారక స్తూపాన్ని నిర్మించలేకపోయారని మండిపడ్డారు. నాలుగు పెద్ద యుద్ధాలు జరిగినా ఒక్క స్మారక స్తూపాన్ని కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి ఒక్కరికి ఈ స్థూపం అంకితమిస్తున్నట్లు తెలిపారు.
అమరవీరుల స్థూపం
దేశరక్షణ కోసం అసువులు బాసిన అమరవీరుల యుద్ధ సార్మకాన్ని ఫిబ్రవరి 25న భారత ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన వార్ మెమొరియల్‌ను ప్రారంభించి, ఆఖండ జ్యోతిని వెలిగించారు. ఈ జ్యోతి నిరంతరాయంగా వెలుగుతుంది.
అయితే, వాస్తవానికి 1961లోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కోసం ఓ స్మారక చిహ్నన్ని రూపొందించాలని ప్రణాళికలు వేశారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. 2014 లో దాన్ని పూర్తి చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల తరువాత నిర్మాణం పూర్తయింది.
అమర జవాన్ల త్యాగం ప్రతిబింబించేలా ఈ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. చక్రవ్యుహం స్ఫూర్తితో రూపొందిన ఈ మొమొరియల్‌ను రూ.176 కోట్లతో వ్యయంతో చేపట్టారు. స్థూపంలోని 16 గోడలపై 25,942 మంది అమర వీరుల పేర్లు, వారి హోదా, రెంజిమెంట్ వివరాలు పొందుపరిచారు.








