
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి రెండో రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలో పేర్కొన్నారు.
గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంతకాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కర్న్ ప్రయాగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నేగి ఇటీవల సీఎం రావత్‌తో సమావేశమైన తర్వాత ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. వేసవి రాజధానిగా గైర్సైన్ ఎంపిక చేయాలని సురేంద్ర గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ ఎన్నికల తీర్మానంలో కూడా గైర్సైన్‌ను వేసవి రాజధానిగా చేస్తామని పేర్కొన్నారు. అయితే ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా డెహ్రాడూన్, జ్యుడీషియల్ రాజధానిగా నైనిటాల్ కొనసాగనున్నాయి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పర్వత పంక్తుల మధ్య..
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉంటుందీ నగరం. ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో పర్వత పంక్తుల మధ్య ఉంటుంది గైర్‌సైన్. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు ఉన్న గైర్‌సైన్‌ను రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్ ఇటీవలే మొదలైంది.
క్రమంగా ఉద్యమ రూపాన్ని సంతరించకుంటోంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన త్రివేంద్రసింగ్ రావత్.. అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నానని, గైర్‌సైన్‌ను వేసవి రాజధానిగా ప్రకటిస్తున్నానని తెలిపారు.
ప్రజల కోరికలను నెరవేర్చాం: సీఎం
చమోలీ జిల్లా ప్రాంత ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని, తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల వైపే మొగ్గు చూపుతుందని త్రివేంద్ర సింగ్ వెల్లడించారు. ఉత్తరాఖండ్ పూర్తిగా పర్వతాలతో నిండిన రాష్ట్రమని అన్నారు.
పర్వత ప్రాంతాల నడుమ ఉండే గైర్‌సైన్‌ను రాజధానిగా చూడాలనే కోరిక పహాడీ ఇలాకా ప్రజల్లో తరచూ వ్యక్తమౌతుండేదని చెప్పారు. వారి డిమాండ్లు, వారి అకాంక్షల మేరకే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని త్రివేంద్ర సింగ్ అన్నారు. ప్రకటించారు.








