28.5 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి.. మహిళా విభాగం నేతగా.. ట్రాన్స్‌జెండర్ నియామకం

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి.. మహిళా విభాగం నేతగా.. ట్రాన్స్‌జెండర్ నియామకం

transgender-apsara-reddy-with-rahul
- Advertisement -

congress-leader-transgender-apsara-reddy

న్యూఢిల్లీ: 134 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ పరిణామం తాజాగా చోటుచేసుకుంది. పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం కల్పించారు. అవును, ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త అయిన అప్సరా రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం తమ పార్టీ ఎంపీ సుస్మితాదేవ్ సమక్షంలో కాంగ్రెస్ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేసిన ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డి 2016లో జయలలిత పార్టీ అయిన ఏఐఏడీఎంకేలో చేరారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధినేత్రి జయలలిత మరణం తరువాత శశికళ అనుకూల వర్గానికి మద్దతు పలికారు. కొంతకాలం బీజేపీలో కూడా పనిచేసిన ఆమె ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో చేరి జాతీయ స్థాయి పదవి పొందారు.

‘‘చాలామంది నన్ను చూసి నవ్వేవాళ్లు..’’

కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ట్రాన్స్‌జెండర్ అప్సరారెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇటీవల కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చాలామంది నన్ను చూసి నవ్వేవాళ్లు.. ఎక్కడికైనా దూరంగా పో అనేవాళ్లు.. నాలాంటి ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెటకారాలు, వెక్కిరింపులు కొత్తేం కాదు.. కానీ నా జీవితంలో ఇప్పుడు ఓ అద్భుతమే జరిగింది..’’ అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ‘‘దేశంలోని అతిపెద్ద, సుదీర్ఘ చరిత్రగల పార్టీలో నాకు ఈ పదవి దక్కడం.. తీవ్ర ఉద్వేగానికి గురిచేస్తోంది. నాకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్ల తరుపున నా గొంతను బలంగా వినిపిస్తాను..’’ అని చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్ మహిళా విభాగం ట్వీట్ చేస్తూ… ‘మహిళా కాంగ్రెస్‌లోకి అప్సరారెడ్డికి స్వాగతం పలుకుతున్నాం. సామాజిక నిబంధనలను అధిగమించి, వాటిని ఆచరణలో పెట్టేందుకు, అవి ఆమోదం పొందేందుకు కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ దారులు పరిచారు అంటూ పేర్కొంది.

- Advertisement -