21.7 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం దేశం తర్వాతే పార్టీ, వారు శత్రువులు కాదు: ఎల్‌కే అద్వానీ కీలక సందేశం

దేశం తర్వాతే పార్టీ, వారు శత్రువులు కాదు: ఎల్‌కే అద్వానీ కీలక సందేశం

advani-modi
- Advertisement -

న్యూఢిల్లీ: తమను రాజకీయంగా వ్యతిరేకించే వారిని భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. శత్రువులుగానో.. జాతి వ్యతిరేకులుగానో పరిగణించలేదని ఆ పార్టీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లాగులో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఈ రాజకీయ కురువృద్ధుడు. కాగా, ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆయన బ్లాగులో రాయడం గమనార్హం. అద్వానీ తన బ్లాగులో ఈ విధంగా పేర్కొన్నారు..

నా జీవిత సూత్రం ఇదే..

ఏప్రిల్‌ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఎంతో అభిమానం, గౌరవం చూపి నన్ను రుణ పడేలా చేసిన దేశ ప్రజలు, ముఖ్యంగా లక్షల మంది పార్టీ కార్యకర్తలతో నా ఆలోచనలను పంచుకుంటున్నాను. బీజేపీ వ్యవస్థాపకునిగా ఇది నా కర్తవ్యమని భావిస్తున్నాను. ఆలోచనలను పంచుకోవడానికి ముందు గాంధీనగర్‌(గుజరాత్) ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారు నన్ను 1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నుకున్నారు. వారు నన్ను ప్రేమ, మద్దతుతో ముంచెత్తారు. 14 ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి మాతృభూమికి సేవ చేయడం నా లక్ష్యంగా మారింది.

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, వాజ్‌పేయీ వంటి మహామహులతో కలిసి సన్నిహితంగా పనిచేసే అపురూపమైన గౌరవం కలిగింది. నా జీవితాన్ని నడిపిస్తున్న మూల సూత్రం ఏమిటంటే..‘మొదట దేశం, తరువాత పార్టీ, ఆ తర్వాతే వ్యక్తిగతం’..అన్ని సందర్భాల్లోనూ దీన్ని పాటిస్తూ వస్తున్నాను. ఇకపైనా అమలు చేస్తాను.

బీజేపీ వ్యతిరేకులు ప్రత్యర్థులే… శత్రువులు కారు

బహుళత్వాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించడమే భారత ప్రజాస్వామ్య సారాంశం. పార్టీని నెలకొల్పిన దగ్గర నుంచీ ఎప్పుడు కూడా బీజేపీ తనను రాజకీయంగా వ్యతిరేకించేవారిని ‘శత్రువులు’గా చూడలేదు. కేవలం ‘ప్రత్యర్థులు’గానే భావించింది. మా జాతీయవాద భావన విషయానికి వస్తే…రాజకీయంగా మాతో ఏకీభవించనివారిని ‘జాతి వ్యతిరేకులు’ అని పరిగణించలేదు. పార్టీలోను, దేశంలోనూ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను రక్షించడమే బీజేపీకి గర్వకారణమైన గుర్తింపు చిహ్నం.

అవినీతి రహిత రాజకీయ వ్యవస్థ కోసం పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకతతో పాటు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్నది బీజేపీ నిర్దేశించుకున్న మరో ప్రాధాన్య అంశం. సంక్షిప్తంగా చెప్పాలంటే పోరాటాల ద్వారా పరిణామం చెందిన బీజేపీ ‘సత్య (సత్యం), రాష్ట్ర నిష్ఠ (దేశంపట్ల అంకిత భావం), లోక్‌తంత్ర్‌ (పార్టీలోను, బయటా ప్రజాస్వామ్యం) అనే సిద్ధాంతత్రయం ఆధారంగా పనిచేస్తోంది. సాంస్కృతిక జాతీయవాదం, సురాజ్యానికి నా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఈ విలువలను కాపాడటానికే అత్యవసరపరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం చేశాం.

ఆత్మ శోధన చేసుకోవాలి..

భారత ప్రజాస్వామ్యమనే దివ్య భవనాన్ని అందరం కలిసి పటిష్ఠపరచాలన్నది నా ప్రగాఢ కోరిక. ఎన్నికలంటే ప్రజాస్వామ్య ఉత్సవం. అంతేకాదు ప్రజాస్వామ్యంలోని భాగస్వాములంతా నిజాయతీగా ఆత్మపరిశీలన చేసుకోవడానికీ సమయం ఇదే. రాజకీయ పార్టీలు, మీడియా, ఎన్నికలు నిర్వహించే అధికారులు, అన్నింటికీ మించి ఓటర్లు అందరూ ఆత్మశోధన చేసుకోవాలి’ అని ఎల్‌కే తన సందేశాన్ని పంచుకున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన ఈ సందేశం పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు గాంధీనగర్ నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేయడం లేదు.

బాగా చెప్పారంటూ మోడీ

అద్వానీబ్లాగ్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ ద్వారా స్పందించారు. ‘బీజేపీ సిద్ధాంతాల సారాంశాన్ని సక్రమంగా చెప్పారు. ‘మొదట దేశం, ఆ తరువాత పార్టీ, చివరనే వ్యక్తిగతం’ అన్నదే పార్టీ మూల మంత్రం. బీజేపీ కార్యకర్తగా గర్విస్తున్నా. అద్వానీలాంటి ప్రముఖులు దాన్ని బలోపేతం చేసినందుకు గర్విస్తున్నా’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

చదవండి: అందుకే కాంగ్రెస్‌ను వీడా..: బీజేపీలోకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్

- Advertisement -