చెన్నై: ఎన్నికలు వస్తే చాలు పోటీ చేసే అభ్యర్థులు ప్రజలపై వరాల జల్లు కురిపించేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచేందుకు అమలు చేయగలమా? లేదా? అని కూడా ఆలోచించకుండా ఏవేవో హామీలు ఇచ్చేస్తుంటారు. తాజాగా, తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కూడా ఇలాంటి హామీలే ఇచ్చేస్తున్నాడు.
తమిళనాడులోని తిరుప్పూర్ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థి షేక్ దావూద్ ఇచ్చిన హామీలు మాత్రం విస్తుపోయేలా ఉన్నాయి. ఆయన హామీలను చూస్తే కళ్లు తిరగాల్సిందే. దావూద్ మేనిఫెస్టోను గమనించినట్లయితే.. నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు సరిపడినంత బంగారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాడట.
10 లీటర్ల కల్తీ లేని మద్యం.. రూ. 10 లక్షల నగదు…
అంతేకాక, మద్యంలో ఔషధ గుణాలు ఉన్నాయట. అందుకే ప్రతి ఒక్కరికీ 10 లీటర్ల కల్తీలేని మద్యాన్ని కూడా అందజేస్తాడట. ఇంకా, నియోజకవర్గంలోని అవివాహితలకు రూ.10 లక్షలు, వివాహితలకు రూ.25 వేలు అందజేస్తాడట.
వీటితోపాటు మరో 15 ప్రధానాంశాలతో కూడిన మేనిఫెస్టోను దావూద్ విడుదల చేశాడు. తనని గెలిపిస్తే కచ్చితంగా వీటిని అమలు చేసి చూపిస్తానంటున్నాడు. ఒకవేళ తాను హామీలు నెరవేర్చకపోతే శిక్షించే అధికారం తమ ఓటర్లకు ఉందంటూ చెప్పుకొస్తున్నాడు.
కాగా, ఇలా భారీ స్థాయిలో హామీలు గుప్పిస్తోన్న ఈయన కోటీశ్వరుడేమీ కాదు. టైలర్ పని చేస్తుంటాడు. అయితే అతనికి మంచి టైలర్‌గా స్థానికంగా పేరుంది. కానీ, ఈ స్థాయిలో హామీలు ఇవ్వడంపై మాత్రం స్థానికులు కూడా నివ్వెరపోతున్నారు.








