
ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హరియాణా సభలో మాట్లాడిన మోడీ….. తాము కేంద్రంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే, రైతులను మోసం చేసిన రాబర్ట్ వాద్రాను జైలుకు పంపించడం ఖాయమని హెచ్చరించారు. అయితే రైతులను మోసం చేసిన వారు తమను ఎవరూ ఏం చేయలేరని అనుకుంటున్నారని, అటువంటి వాళ్లని జైలు వరకు తీసుకెళ్లతానని అన్నారు.
చదవండి: కేజ్రీవాల్‌పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు….
దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్మును కక్కిస్తానని, ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ముందే చేతులెత్తేశాయని ఎద్దేవా చేశారు.
మోడీకి వాద్రా కౌంటర్….
ఇదిలా ఉంటే మోడీ వ్యాఖ్యలపై రాబర్ట్ వాద్రా స్పందించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రధాని తన గురించి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, మహిళా సాధికారత మొదలైన సమస్యలు ఎన్నో ఉంటే వాటిని పక్కనపెట్టి తన గురించి మోడీ మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
అయితే ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వం నుంచి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, ఈ చర్యల ద్వారా తనపై మానసిక ఒత్తిడి పడేలా చేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రసంగాల ద్వారా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను దయచేసి ఆపాలని కోరారు. ఇక ఇప్పటి వరకూ తనకు ఎన్నో సమన్లు జారీ చేశారని, అయితే, ఏ ఒక్క ఆరోపణను రుజువు చేయలేదని వాద్రా తెలిపారు.








